'పార్లమెంట్లో కబడ్డీ ఆడుకుంటాం'
విజయవాడ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామా వ్యవహారంపై ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కిరణ్ తన నిర్ణయాన్ని ఈనెల 21 వరకూ వేచి చూడాలని చెప్పామన్నారు. ఆ తర్వాతే శాసనసభను రద్దు చేయాలని సీఎంకు వివరిస్తామని లగడపాటి అన్నారు. ముఖ్యమంత్రిని గుడ్డిగా నమ్మినవారికి న్యాయం చేయాల్సి బాధ్యత కూడా ఆయనపైనే ఉందని లగడపాటి అన్నారు. రాష్ట్రం విడిపోకుండా కిరణ్ ఏం చేసిన ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశారు.
కేంద్రం సీమాంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని...ప్రతికారం తీర్చుకునేందుకు కేంద్రమంత్రులు బిల్లును అడ్డుకోవాలన్నారు. తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు... వెల్లోకి కేంద్రమంత్రులు ప్రవేశిస్తే బిల్లు ఆగిపోతుందన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి అన్ని రకాల వ్యూహాలతో ముందుకు వెళుతున్నామని లగడపాటి తెలిపారు.
పార్లమెంట్లో కబడ్డీ ఆడుకుంటామని ఆయన తెలిపారు. ఏం చేసి అయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని అన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును కేబినెట్ ఆమోదించటం దురదృష్టకరమన్నారు. ఆదివారం జరగబోయే సమైక్య రన్లో ప్రజలంతా పాల్గొనే సమైక్యవేడి ఢిల్లీ తాకేలా చేయాలని పిలుపునిచ్చారు.