కోదాడటౌన్, న్యూస్‌లైన్: కోదాడ ప్రభుత్వ వైద్యశాల స్థల ఆక్రమణను అడ్డుకుంటామని, తప్పుడు నివేదికలతో స్థలాన్ని కాజేయాలని చూస్తున్న విషయాన్ని తమ న్యాయవాది ద్వారా కలెక్టర్‌కు వివరించామని, కలెక్టర్ వద్ద రివ్యూ పిటిషన్ దాఖలు చేయటంతో పాటు వైద్యశాలలో ఉన్న ప్రస్తుత వివాదాస్పద స్థలంలో ఎటువంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వవద్దని కోదాడ మున్సిపాలిటీలో ఫిర్యాదు చేస్తామని జిల్లా ప్రభుత్వ వైద్యశాలల కోఆర్డినేటర్ సురేష్‌కుమార్ అన్నారు. రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ అధికారుల అదేశం మేరకు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ఆయన అఖిలపక్ష నాయకులతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలో మిగులు భూమిలేదని, దానిని తమ ఇంజినీర్లు ధ్రువీకరించారని తెలిపారు. కొందరు సర్వేయర్లు పక్కన ఉన్న మున్సిపాలిటీ రోడ్డును కూడా ప్రభుత్వ వైద్యశాలలో కలిపి మిగులు స్థలం ఉన్నదని తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆయన అన్నారు.
ఒకవేళ ఆ రోడ్డు ప్రభుత్వ వైద్యశాల స్థలంలోనిది ఐతే తాము ఆ రోడ్డును స్వాధీనం చేసుకుంటామని, వైద్యశాల స్థలంలో కలిపివేసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీ జోక్యం చేసుకుని నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని కోరారు. స్థలాన్ని కాపాడుకునేందుకు రాజధాని స్థాయిలో ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు దొడ్డా నారాయణరావు, బద్దం భద్రారెడ్డి, కనగాల నారాయణ, ఎస్‌కె లత్తు, గంధం బంగారు, బంగారు నాగమణి, కుదరవెల్లి బసవయ్య, పొడుగు హుస్సేన్, నాళం రాజన్న, పాలకి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, బరిగెల పుల్లయ్య పాల్గొన్నారు.
ఆక్రమణను అడ్డుకుంటాం
Published Wed, Sep 4 2013 2:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement