పెళ్లిళ్లకు ఉద్యమ ఎఫెక్ట్ ?
Published Thu, Aug 8 2013 4:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
అన్నవరం, న్యూస్‌లైన్ :ఈ నెల పదోతేదీ నుంచి శ్రావణ మాసం పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. రత్నగిరి, సత్యదేవుని సన్నిధి పెళ్లిళ్లకు సిద్ధమవుతోంది. ఏటా శ్రావణమాసంలో రత్నగిరిపై సుమారు 300 వివాహాలు జరుగుతాయనేది ఓ అంచనా. ఈనెల పదో తేదీ నుంచి వివాహాలు ప్రారంభం కానున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో రత్నగిరికి వచ్చే భక్తుల రాక తగ్గింది. ఆలయంలో వివాహాలు కూడా తక్కువ జరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంటున్నాయి. రెండు నెలల విరామం అనంతరం మరలా ఈనెల పదో తేదీ శ్రావణ శుద్ధ చవితి ఉత్తర నక్షత్రం, వృషభ లగ్నంలో వివాహ ముహూర్తంతో ఈ వివాహాల సీజన్ ప్రారంభం కానుంది. వరుసగా 11,12,15,16,17,21,23,25,29 తేదీల్లో వివాహాలు జరగనున్నాయి.
సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, బంద్ ప్రభావంతో ఈ ముహూర్తాల్లో జరిగే వివాహాలను వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ముహూర్తాలలో పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నట్టు వివాహ బృందాలు సమాచారం అందించాయని క్యాటరింగ్, డెకరేషన్ కార్మికులు తెలిపారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో వివాహాలు నిర్వహిస్తామని వారు చెప్పినట్టు సమాచారం.
సత్యదేవుని ఆలయానికి ఏటా కార్తీక, వైశాఖం తర్వాత శ్రావణమాసంలోనే భక్తులు ఎక్కువగా వస్తారు. సుమారు 5 లక్షల మంది భక్తులు రత్నగిరికి వచ్చే అవకాశం ఉందని అంచనాతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేసారు. ఆదాయం శ్రావణ మాసంలో రూ.మూడు కోట్లు వరకూ రాగలదని అంచనా వేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఈ అంచనాలు నిజమవుతాయా అనేది ఆలయ వర్గాల్లో సందేహం నెలకొని ఉంది.
ఏర్పాట్లపై ఈఓ సమీక్ష
ఈఓ పి. వేంకటేశ్వర్లు, దేవస్థానం అధికార్లతో బుధవారం ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రావణ శుక్రవారం, శని, ఆది వారాల్లోనూ, దశమి, ఏకాదశి, పౌర్ణమి వంటి తిథుల్లో సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశారు. సత్యగిరిపై గల హరిహర సదన్, విష్ణు సదన్ సత్రాల్లో బస చేసే భక్తుల కొరకు దేవస్థానం బస్‌ను సత్రం గదుల రిజర్వేషన్ కార్యాలయం నుంచి సత్యగిరికి ఉచితంగా నడుపనున్నారు.పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఈఓ ఆదేశించారు.
Advertisement
Advertisement