సంక్షేమ పథకాలు శాశ్వతం కాదు..
మూడో విడత జన్మభూమి-మా ఊరులో సీఎం
సాక్షి, ఏలూరు/ కాకినాడ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు శాశ్వతం కాదని, ప్రజలు తమ ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు సూచించారు. ఆయన శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో, కాకినాడ పర్లోవపేటలో నిర్వహించిన మూడవ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
ప్రభుత్వోద్యోగులకు కరువు భత్యం
ఎన్నో నెలల నుంచి ఎదురుచూస్తున్న కరువు భత్యాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు నగదు రూపంగా చెల్లించనున్నట్టు సీఎం ప్రకటించారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసిన ఉద్యోగులు 80 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేసి ఉద్యోగులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాపులను బీసీల్లో చేర్చే బాధ్యత తనదేనన్నారు.
మీరు తప్పు చేస్తే నాకు చెడ్డపేరు
సాక్షి, విజయవాడ: నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి నూతన రాజధానిలో ఎన్నో అవకాశాలు ఉంటాయని, అయితే తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశపడి తప్పు చేస్తే తనకు చెడ్డపేరు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన శుక్రవారం కాన్ఫెడరేషన్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరుగుతున్న ప్రాపర్టీ షోను ప్రారంభించారు.