
తప్పనిసరి మూడు‘ముళ్లు’
పదో తరగతి తర్వాత అథోగతి
పాసైనా, ఫెయిలైనా పెళ్లి ఖాయం
మన్యంలో కొనసాగుతున్న బాల్యవివాహాలు
తూతూ మంత్రంగా స్పందిస్తున్న అధికారులు
మన్యం వాసుల నిరక్షరాస్యత, అధికారుల నిర్లక్ష్యం బాల్యవివాహాలకు దారి తీస్తున్నాయి. ఏదో పదో తరగతి వరకూ చదివించి పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావించడం, వీటిని అరికట్టాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో లోకం తెలియని వయసులోనే మూడు‘ముళ్లూ’ పడిపోతున్నాయి.
బుట్టాయగూడెం :ప్రతి ఏటా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారుల దృష్టికి వచ్చిన వివాహలు మాత్రమే ఆగుతున్నాయి తప్ప బయటకు రాని పెళ్లిళ్లు చాలా ఉంటున్నాయి. గత ఏడాది వేసవి కాలంలోనే మండలంలో రెండు చోట్ల బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. అయితే వారు అడ్డుకున్న తరువాత కూడా బయటకు రాకుండా పెద్దలు సహకారంతో మండలంలో కొన్ని బాల్య వివాహాలు జరిగాయని తెలుస్తోంది. ఇంట్లో సమస్యల కారణంగానో, తాతామామ్మలు మనవరాలి పెళ్లి చూడాలని ఒత్తిడి తేవడం వల్లో బాల్య వివాహాలు చేస్తున్నామని ఏజెన్సీ ప్రాంతంలోని తల్లిదండ్రులు తరచుగా చెబుతుంటారు.
పదోతరగతి పూర్తయిన తరువాత ఇంటర్ ఎంతమంది చదువుతున్నారు ?పదోతరగతి ఫెయిల్ అయిన వారిలో తిరిగి ఎంతమంది పరీక్ష రాస్తున్నారు. లేక తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారా అనే విషయంపై ఆరా తీసేవారు లేకపోవటంతో ఏజెన్సీ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులకు అవగాహన క ల్పించ కపోవటంతో ఇటువంటివి జరుగుతున్నాయని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులో వివాహం వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయని చెప్పే అధికారులు శ్రద్ధ తీసుకుంటే చాలావరకు వీటిని అరికట్టవచ్చు. పదోతరగతితో చదువుమానేసిన వారిని ఐటీడీఏ అధికారులు ఎంతమందిని గుర్తించారో వారికే ఎరుక.
ముఖ్యంగా బాల్య వివాహాలపై కిషోర బాలికలకు సంవత్సరంలో ఒకసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. బాల్య వివాహాలపై రెండు ,మూడు నెలలకు ఒకసారైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే వారిలో చైతన్యం వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించే వారిని ఉన్నత చదువులకు పంపేలా, ఉత్తీర్ణత సాధించని వారికి నచ్చిన అంశంలో శిక్షణ ఇచ్చి చేయూత నిచ్చేలా కృషి చేస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. గిరిజన ప్రాంతంలో నిరక్ష్యరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారే తప్ప తరువాత వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోలేకపోతున్నారు.
ప్రణాళిక రూపొందిస్తాం
పదోతరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి పరీక్షలు రాయిస్తున్నాం. సప్లమెంటరీ రాసిన తరువాత కూడ ఫెయిల్ అయినవారు తరువాత ఏం చేస్తున్నారో తెలియదు. అటువంటి విద్యార్థుల గురించి ఇప్పటి వరకూ ఏ చర్యలు తీసుకోవటం లేదు. ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై ఒక ప్రణాళిక రూపొందిస్తాం.
- బి.మల్లికార్జునరెడ్డి, డెప్యూటి డెరైక్టర్, ఐటీడీఏ