హోండా టాలెంట్ హంట్ టెస్ట్‌లో పాల్గొన్న దాసరి సాయిధర్
పశ్చిమగోదావరి,జంగారెడ్డిగూడెం: జిల్లాకు చెందిన సాయిధర్‌ను రేసర్ కావాలనే అతని ఆసక్తి టాలెంట్ హంట్ టెస్ట్‌లో ఫైనల్ వరకు తీసుకువెళ్లింది. చిన్నతనం నుంచి రేసింగ్‌పై మక్కువ ఉన్న అతను హోండా–టెన్10 రేసింగ్ అకాడమీ నిర్వహిస్తున్న 2018 హోండా టాలెంట్ హంట్ టెస్ట్‌కు వెళ్లి సత్తాచాటాడు. ఫైనల్ పోరులోనూ పాల్గొన్నాడు. వివిధ దశలో ఫైనల్ జరిగింది. ప్రస్తుతం అతను ఫైనల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఫైనల్‌లో విజేతగా నిలిస్తే రేసింగ్ అకాడమీకి ఎంపికవుతాడు. దీంతో జాతీయ స్థాయిలో రేసింగ్ పోటీలకు పాల్గొనేందుకు మార్గం సుగమం అవుతుంది. ఏలూరుకు చెందిన 18 ఏళ్ళ దాసరి సాయిధర్ ఆల్ ఇండియా లెవల్ హోండా ఇండియా టాలెంట్ హంట్ టెస్ట్‌లో ఫైనల్ క్వాలిఫయింగ్ పూర్తిచేశాడు. గత నెల 27 నుంచి చెన్నై ఇరున్‌గటుకొట్టాయ్‌లోని మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ రేస్ ట్రాక్‌లో జరిగిన ఫైనల్ పోటీల్లో ప్రతిభ చాటాడు.
వివిధ దశల్లో
హోండా టాలెంట్ హంట్ టెస్ట్ మూడు దశలలో జరుగుతుంది. మొదటి దశలో రాష్ట్రస్థాయిలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో డ్రైవింగ్ స్కిల్స్, ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. మూడో స్టేజ్‌లో రేస్ ట్రాక్‌పై పోటీ నిర్వహిస్తారు. తొలి క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో భాగంగా సాయిధర్ ఆన్‌లైన్ పరీక్షను పూర్తిచేసి రెండో క్వాలిఫయింగ్ ఎంపికయ్యాడు. ఈనెల 18న తెలంగాణ రాష్ట్రం షామీర్‌పేట్‌లో జరిగిన రెండో క్వాలిఫయింగ్‌లో 16 మందితో పోటీ పడి విజేతగా నిలిచాడు. మొత్తం ఐదు రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొనగా రాష్ట్రానికి ఒకరు చొప్పున ఎంపిక చేశారు. వీరిలో 4వ వాడిగా సాయిధర్ రాష్ట్రం నుంచి ఎంపికయ్యాడు. 27వ తేదీ నుంచి చెన్నై ఇరున్‌గటుకొట్టాయ్‌లోని మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ రేస్ ట్రాక్‌లో జరుగుతున్న పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీలో మొత్తం 9 మంది పాల్గొనగా, ప్రస్తుతం సాయిధర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు అనంతరం హోండా టెన్10 రేసింగ్ అకాడమీకి ఐదుగురిని ఎంపిక చేస్తారు.
ఇదీ నేపథ్యం
ఏలూరులో పుట్టి పెరిగిన సాయిధర్ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గిరిధర్ పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. సాయిధర్ చిన్నతనం నుంచి బైక్ రేస్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు. ఖాళీ సమయాల్లో టీవీలో ఎక్కువగా బైక్ రేస్‌లను చూస్తుండేవాడు. క్రమేపీ ఆ ఆసక్తి అతను బైక్ సంబంధిత గేమ్స్ వైపు మళ్ళింది. ఇదే సమయంలో మోటార్ బైక్‌ను నేర్చుకోవడం, బైక్ నడపటంలో నైపుణ్యతను సాధించాడు. ఇది గమనించిన సాయిధర్ సోదరుడు శశిధర్ తమ్ముడిని మరింత ప్రోత్సహించాడు. ఎప్పటికైనా జాతీయా స్థాయిలో మంచి రేసర్‌ని కావాలనే తన ఉద్దేశాన్ని సోదరుడికి తెలపడంతో తమ్ముడిని ప్రోత్సహించాడు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌కి పంపించాడు. అక్కడ సాయిధర్ ఫిజికల్ ట్రైనింగ్, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాడు. అయితే జాతీయ స్థాయి రేసర్ కావాలంటే అతనికి రేసింగ్ లైసెన్స్ ఉండాల్సి రావడంతో అకాడమీకి పంపాలని యోచన చేశాడు. ఇదే సమయంలో హోండా టెన్10 రేసింగ్ అకాడమీ రేసింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చే నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆన్‌లైన్ ప్రకటన ఇచ్చింది. దీంతో సాయిధర్ దరఖాస్తు చేసుకుని పోటీల్లో పాల్గొన్నాడు.
మంచి రేసర్‌నికావాలనేదే లక్ష్యం
నాకు బైక్ రేసులంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి బైక్ రేసులను ఎక్కువగా చూసేవాడిని. గేమ్స్ కూడా ఆడేవాడిని. వాటిలో ఉన్న కొద్ది మెలకువలతో నేను బైక్‌ను నేర్చుకున్నాను. నాకున్న ఆసక్తికి నా తండ్రి గిరిధర్, సోదరుడు శశిధర్‌లు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ప్రస్తుతం అకాడమీలో చేరేందుకు పోటీకి హాజరయ్యాను. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో మంచి రేసర్‌గా గుర్తింపు పొందాలనేది నా లక్ష్యం.
–సాయిధర్, రేసర్
Comments
Please login to add a commentAdd a comment