
ఏంటి బాబూ ఇది?
తొండంగి: తీరప్రాంతంలో రైతులు, మత్స్యకారుల జీవనాన్ని దెబ్బతీస్తున్నారంటూ గతంలో గగ్గోలు పెట్టి.. సెజ్ భూముల్లో దుక్కుదున్నిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం అవే భూముల్లో పరిశ్రమలు ఎలా పెడతారని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సూటిగా ప్రశ్నించారు. తొండంగిలో ఈనెల ఐదోతేదీన నిర్వహించబోయే పింఛన్ల మంజూరుపై ధర్నాపై ఆదివార ం ఆయన సమావేశం నిర్వహించారు. అధికారం రాకముందు రైతుల భూములను అభివృద్ధి పేరుతో ఏవిధంగా తీసుకుంటారని, నాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే తొండంగి సెజ్‌భూముల్లోనే పరిశ్రమలు స్థాపనకు ఏవిధంగా శంకుస్థాపనలు చేస్తారని ప్రశ్నించారు.
పెద్దకొడుకునంటూ రైతుల నెత్తిపై కుంపటి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే ప్రజావ్యతిరేక విధానాలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. సెజ్‌పేరుతో లక్షలు విలువ చేసే భూములను కార్పొరేట్ సంస్థలకు ఏవిధంగా ధారాదత్తం చేస్తారన్నారు. రైతుల భూములను వెనక్కి ఇచ్చేవరకూ పార్టీపరంగా పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు మాకినీడి గాంధీ, పేకేటిసూరిబాబు, కొయ్యాశ్రీనుబాబు, కోడావెంకటరమణ, మండల కన్వీనర్ చొక్కాహరిబాబు, అచ్చాఅప్పారావు, కోనాలరాములు, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు ఉన్నారు.