జగన్‌తో ప్రయాణం అంటే..జనంతోనే... | What's journey .. crowded ... | Sakshi
Sakshi News home page

జగన్‌తో ప్రయాణం అంటే..జనంతోనే...

Published Sun, Nov 17 2013 2:39 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM

What's journey .. crowded ...

 =న్యాయం కోసం పోరాటం చేసినా రాజకీయాలేనా?
 = క్యాబినెట్ నిర్ణయాలను తప్పుపట్టి జైల్లో పెట్టారు
 =ప్రజలు జగన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నారు
 = మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడి
 

 పామర్రు రూరల్, న్యూస్‌లైన్ : జగన్‌తో ప్రయాణం అంటే జనంతో ఉన్నట్లేనని, అందుకే వైఎస్సార్‌సీపీలో చేరానని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. న్యాయం కోసం 16 నెలలు పోరాడి బెయిల్ తెచ్చుకుంటే దీన్ని కూడా అధికార, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగి రోడ్డుమార్గంలో తన సొంత నియోజకవర్గమైన రేపల్లెకు పామర్రు మీదుగా వెళ్లారు.
 
 ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆగిన ఆయన పార్టీ కార్యాలయంలో ఉన్న మహానేత ైవె ఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసం మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలను తప్పుబట్టి తనను జైల్లో పెట్టారని ఆవేదన చెందారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోవాలనే కుట్రతోనే ముందుగా తనను, అనంతరం జగన్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు.
 
 16 నెలల పాటు న్యాయం కోసం పోరాడి కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకుంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆవేదన చెందారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావటానికి కారణం కాంగ్రెస్‌తో కలవడమేనంటూ ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నాయని మోపిదేవి విమర్శించారు.
 
 రాష్ట్ర ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఎదురుచూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాబోయే కాలంలో వచ్చే జగన్‌మోహన్‌రెడ్డి ప్రాభవాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వెనకే ఉన్నారని స్పష్టం చేశారు. అందుకే జగన్‌తో ఉంటే జనంతో ఉన్నట్లేనని పేర్కొన్నారు.
 
 చెయ్యని నేరానికి జైలు...
 
 మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ బలహీన వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ చెయ్యని నేరానికి జైలు జీవితాన్ని అనుభవించారని చెప్పారు. బలహీన వర్గాల నేతలపై పాలకుల క్రూరత్వం ఎలా ఉంటుందో మోపిదేవి వెంకటరమణ కేసులో స్పష్టమైందన్నారు. వైఎస్ లేని సమయంలో రాష్ట్రాభివృద్ధికి జగన్ మోహన్‌రెడ్డి అవసరం ఎంతైనా ఉన్నదని ప్రజలు గ్ర హించారని చెప్పారు.
 
 ఈ కార్యక్రమంలో పామర్రు సర్పంచ్ దేవరకొండ రోహిణి, ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు ముత్తేవి ప్రసాద్, పార్టీ యూత్ మండల కన్వీనర్ మద్దాలి అరవింద్, ప్రచార కమిటీ మండల కన్వీనర్ కూసం పెద వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement