పిచ్చామె రాయి విసిరిన చోటే రాజధాని: జేసీ
సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పిచ్చామె చేతిలోనే అధికారం ఉంటుందని, ఆమె తన చేతిలోని రాయి ఎక్కడ విసిరితే అక్కడే సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పడుతుందని మాజీ మంత్రి, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పేరు ఎత్తకుండా, గతంలో కంటే మరింత ఘాటుగా ఆయన విమర్శలు గుప్పించారు.
పిచ్చామె విసిరిన రాయి నిజామాబాద్లో పడినా ఆ ప్రాంతాన్ని సీమాంధ్ర రాజధానిగా అంగీకరించాల్సి వస్తుందని జేసీ మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆరే అవుతారని ఆయన ఖాయంగా చెప్పారు. అటు తెలంగాణ ప్రాంతంలోను, ఇటు సీమాంధ్ర ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ నేతలతో రహస్యంగా మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.