► ఎర్రస్మగ్లర్లలో సౌందర్‌రాజన్ పదో నిందితుడు
► జిల్లాకు చెందిన స్మగ్లర్లపై బిగుస్తున్న ఉచ్చు
► తమిళ తంబీలపై కేసులకు రంగం సిద్ధం
చిత్తూరు (అర్బన్) : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సౌందర్‌రాజన్ అరెస్టు స్మగ్లర్లలో దడ పుట్టిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో పట్టుబడ్డ సౌందర్‌రాజన్ నుంచి పోలీసులు దాదాపు రూ.30 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సౌందర్‌రాజన్‌ను గురువారం చిత్తూరు న్యాయస్థానంలో హాజరుపరచిన పోలీసులు అతడిని పదో నిందితుడిగా చూపించారు. సౌందర్‌ను పదో నిందితుడిగా చూపిస్తే మరి మిగిలిన తొమ్మిది మంది ఎవరు..? అనే ప్రశ్న ప్రధాన స్మగ్లరను కలవరపెట్టినట్టవుతోంది.
ఎర్రచందనం దుంగలు ఎక్కడ దొరికినా... ఆ సంఘటనకు జిల్లాతో సంబంధం ఉంటోంది. శేషాచలం అడవుల్లో విస్తరించి ఉన్న ఎర్రచందనం దుంగలను జిల్లాకు చెందిన స్మగ్లర్ల సాయంతోనే ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తుంటారు. జిల్లాలో ఆపరేషన్ రెడ్ ప్రారంభించి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్ల కాలంలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్లు ఒక ఎత్తయితే, ప్రస్తుతం పోలీసులు పట్టుకున్న అంతర్జాతీయ స్మగ్లర్ సౌందర్‌రాజన్ ఇంకో ఎత్తు.
పశ్చిమ బెంగాల్‌లో ఇతనికి సంబంధించిన మూడు గోడౌన్లు, చెన్నైలోని ఇతని అనుచరుడు శరవణన్‌కు చెందిన రెండు గోడౌన్లలో దాదాపు రూ.30 కోట్లు విలువచేసే ఎర్రచందనం పట్టుబడింది. ఇది అసాధారణ విషయం. అయితే శరవణన్, సౌందర్‌రాజన్ అరెస్టుతో ఆపరేషన్ రెడ్ ముగిసిపోలేదు. సౌందర్‌రాజన్ రిమాండు రిపోర్టులో ఇతను పదో నిందితుడు కావడంతో ఈ కేసు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు చెప్పకనే చెప్పాయి.
దీనికి తోడు జిల్లాకు చెందిన పోలీసులు ఐదు రోజులుగా తమిళనాడులోని తిరుత్తణి, చెన్నై, వేలూరు, వానియంబాడి తదితర ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పేరు మోసిన మరో నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి జిల్లాకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక శేషాచలం అడవుల నుంచి స్థానికుల ప్రమేయం లేకుండా ఎర్రచందనం దుంగలు నేరుగా తమిళనాడుకు, పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే ప్రసక్తేలేదు.
ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన కొందరు స్మగ్లర్ల సాయంతోనే దుంగలు దేశం సరిహద్దులు దాటుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆపరేషన్ రెడ్‌లో జిల్లాకు చెందిన వ్యక్తుల్లో దాదాపు 94 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సౌందర్‌రాజన్ అరెస్టుతో ఇప్పటికే బెయిల్‌పై వచ్చిన జిల్లాకు చెందిన స్మగ్లర్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
మరోవైపు స్మగ్లర్లకు సహాయ సహకారాలు అందిస్తున్న ఇంటి దొంగలపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, అటవీశాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఒక్క ఎర్రచందనం దుంగను జిల్లా సరిహద్దులు దాటించే ప్రసక్తేలేదు. అలాంటప్పుడు ఆపరేషన్ రెడ్‌లో వేల మందిని అరెస్టు చేస్తున్నారే తప్ప వీరికి సహరిస్తున్న ప్రభుత్వ అధికారుల వివరాలు మాత్రం బయటకు రాకపోవడం, వచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుశాఖపై విమర్శలు వస్తున్నాయి.
ఆ తొమ్మిది మంది ఎవరు ?
Published Fri, Apr 24 2015 4:23 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement