సాక్షి ప్రతినిధి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కమలంతో దోస్తీ తమ కొంప ముంచేలా ఉందని వాపోతున్నారు.
జిల్లాలోని 17 నియోజకవర్గాలుండగా అన్నింటిలో ముస్లింల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. బీజేపీతో పొత్తు ముస్లిం సోదరుల ఓట్లకు గండి కొడుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బీజేపీ పట్టణ నియోజకవర్గాలు ఉన్న సీట్లు మాత్రమే కోరాలని నిర్ణయించింది. పట్టణ ఓటర్లపై ఎక్కువ శాతం మోడీ ప్రభావం ఉంటుందని వారు భావించడమే ఇందుకు కారణం.
రాష్ట్రంలో 26 అసెంబ్లీ సీట్లను బీజేసీ కోరింది. ఇందులో 15 నుంచి 20 సీట్లను కేటాయించే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లాకు ఒక సీటును కేటాయించవచ్చు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో బీజేసీ కేడర్ లేకపోవడంతో ఆ సీట్లను కేడర్ ఎక్కువుగా ఉన్న జిల్లాల్లో కేటాయిస్తారని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో నాలుగు సీట్లు కేటాయించాలని బీజేపీ కోరుతున్నప్పటికీ రెండు సీట్లు కేటాయించే అవకాశాలున్నట్టు ఆ పార్టీనేతలు చెబుతున్నారు.
గుంటూరు తూర్పు, పశ్చిమ, మంగళగిరి, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏవైనా రెండు తమకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. గుంటూరు పశ్చిమ, బాపట్లలో ముస్లిం ఓట్లు శాతం కొంత తక్కువుగా ఉంటుంది. దీంతో ఆయా స్థానాలనే పొందేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అధిష్టానంపై నేతల ఒత్తిళ్లు..
మరోవైపు గుంటూరు పశ్చిమ, బాపట్ల స్థానాల్లో పోటీచేసేందుకు టీడీపీ ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీచేస్తారో తేల్చుకోవాలని చంద్రబాబు ఇప్పటికే సూచించినట్లు సమాచారం. అదే సమయంలో పశ్చిమం నుంచి వసంత కృష్ణప్రసాద్, తులసి రామచంద్రప్రభు, బాపట్ల నుంచి చీరాల గోవర్ధనరెడ్డి, అన్నం సతీష్ ప్రభాకర్ తదితరులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పొత్తుల్లో ఈ సీట్లు బీజేపీకి కేటాయించకుండా ఉండేలా అధిష్టానంపై ఈ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో ఉన్న ఆరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దాదాపు ఖరారైనట్లే, నరసరావుపేటకు కోడెల శివప్రసాదరావు, తెనాలికి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు పోటీచేయడం ఖాయమైంది. మిగిలిన వాటిల్లో రెండు ఎస్సీ రిజర్వు స్థానాలు ఉన్నాయి. గతంలో టీడీపీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకొన్న సమయంలో మంగళగిరి, సత్తెనపల్లి సీట్లను వారికి కేటాయించేది.
ఇప్పుడు బీజేపీకి మంగళగిరి, సత్తెనపల్లి సీట్లు కేటాయించినా అక్కడి టీడీపీ నాయకులు బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం తక్కువ. సత్తెనపల్లి టికెట్టును నిమ్మకాయల రాజనారాయణ, మంగళగిరి టికెట్టు రేసులో బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, పోతిన శ్రీనివాసరావులు ఉన్నారు. జిల్లాలో బీసీలకు కేటాయించే సీట్లు మంగళగిరి, సత్తెనపల్లి కావడంతో వీటిల్లో ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే బీసీల్లో సైతం టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.
రెబల్స్‌గానైనా బరిలోకి..
బీజేపీతో పొత్తు కుదరనున్న నేపధ్యంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గుంటూరు పశ్చిమ, బాపట్ల, మంగళగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒకవేళ తమ నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇస్తే రెబల్ అభ్యర్ధులుగానైనా పోటీచేయాలని వారు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించడంలో కీలకపాత్ర పోషించిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ప్రజలు జీర్ణించు కోలేకపోతున్నారు.
ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏకపక్షంగా పార్లమెంటు ద్వారాలు మూసి, లోక్‌సభ కార్యకలాపాల లైవ్‌ను నిలిపివేసి మరీ తెలంగాణా బిల్లుకు మద్దతు పలికిన బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నిన్నటి వరకు బీజేపీ సైతం రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమంటూ విమర్శలు గుప్పించిన టీడీపీ నాయకులు ఇప్పుడు వారితో కలిసి పోటీ ఎలా చేస్తారంటూ ప్రత్యర్ధులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అదే సమయంలో ముస్లిం, మైనారిటీలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో టీడీపీ నాయకులు తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. బీజేపీతో పొత్తు లాభం కంటే నష్టమే ఎక్కువని ఇక్కడి సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
త్యాగయ్యలెవరో..!
Published Sat, Apr 5 2014 1:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement