అనర్హులకు ఓటు కల్పించిందెవరు..?
కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన ఉమ్మడి హైకోర్టు
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు ప్రక్రియలో అనర్హుల దరఖాస్తులను ఆమోదించి, వారికి ఓటు హక్కు కల్పించిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఉమ్మడి హైకోర్టు గురువారం ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పించిన అధికారుల వివరాలను, ఆ దరఖాస్తులను పునఃపరిశీలన చేసిన అధికారుల వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఓట్ల నమోదు ప్రక్రియ, ఆ సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాల వ్యవహారాన్ని తామే స్వయంగా పర్యవేక్షిస్తామని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాలు.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో అనర్హులకు స్థానం కల్పించడాన్ని సవాలు చేస్తూ అనంతపురం జిల్లాకు చెందిన జి.ఓబులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.