లక్కెవరిదో?
మద్యం పాలసీ విడుదల
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
లాటరీ ద్వారానే మద్యం దుకాణాల కేటాయింపు
28న లాటరీ
నెల్లూరు(క్రైమ్): ఎక్సైజ్ సంవత్సరానికి (2014-15) సంబంధించి కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి వెల్లడించింది. కొత్తసీసాలో పాత సారా అన్నట్టు నూతన మద్యం పాలసీ ఉంది. కొద్దిపాటి మార్పులు మినహాయిస్తే మిగతా పాలసీ అంతా పాతదే. బెల్ట్‌షాపులు అరికట్టేందుకు ఎలాంటి ప్రణాళిక విడుదల చేయకపోవడంతో ఇకపై ఊరూరా ఆరు క్వార్టర్లు మూడు బీర్లు అన్న చందంగా మద్యం పొంగిపొర్లే అవకాశం ఉంది. కాకపోతే ప్రతి బాటిల్‌కు తప్పనిసరి కంప్యూటర్ బిల్లు ఇవ్వాలన్న నిబంధన అక్రమ వ్యాపారులకు మింగుడుపడటం లేదు. మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్‌కోడ్ ముద్రణ లిక్కర్‌మాఫియా పాలిట పిడుగుపాటుగా మారింది. లెసైన్సీలకు ఏడాది కాలపరిమితి విధించింది. జూలై నుంచి పాలసీ అమలువుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారుల్లో కదలిక మొదలైంది. జిల్లాలో 348 మద్యం దుకాణాల కోసం సిండికేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 348 మద్యం దుకాణాలున్నాయి. గత ఎక్సైజ్ సంవత్సరంలో 318 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలినవి ఖాళీగా ఉన్నాయి.
జిల్లాకు ఐదు శ్లాబులు వర్తింపు
కొత్త మద్యం పాలసీ ప్రకారం ఫిక్స్‌డ్ లెసైన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. 2013-14 ఎక్సైజ్ సంవత్సరంతో పోలిస్తే లెసైన్స్ ఫీజుల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. గత ఏడాది 10 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజు ఉండగా, ఈ ఏడాది రూ.36 లక్షలు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. పది వేలు లోపు జనాభాకు రూ.32.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా వరకు రూ. 36లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా వరకు రూ.45 లక్షలు, 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా వరకు రూ.50 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.64 లక్షలుగా లెసైన్స్‌ఫీజును నిర్ణయించారు.
బెల్టుషాపుల మూసివేత ఒట్టిదేనా?
బెల్టుషాపుల మూసివేతకు పకడ్బందీ ప్రణాళిక ప్రకటించకపోవడంతో పల్లెల్లో మద్యం పొంగిపొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత విధానం ప్రకారమే వైన్‌షాపులను లాటరీ ద్వారా కేటాయించాలని నిర్ణయించడంతో మహిళలు, మద్యపాన నిషేధ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదికి రూ.132.32 కోట్లు ఆదాయం
జిల్లా వ్యాప్తంగా 348 మద్యం దుకాణాలను జనాభా ప్రాతిపదికన నిర్ణయించారు. వీటికి లెసైన్స్‌ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి సుమారు 132.32 కోట్లు ఆదాయం ఏటా సమకూరనుంది. వేలంలో పాల్గొనడానికి ప్రతి దరఖాస్తుదారుడు రూ.25 వేలు చెల్లించాల్సిందే. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.87 లక్షలు ఆదాయం రానుంది. దరఖాస్తుదారులు పార్టిసిపేషన్ ఫీజుతో పాటు 10శాతం దరావత్తు చెల్లించాలి. వేలం తర్వాత ఎవరికీ పార్టిసిపేషన్ ఫీజు మొత్తాన్ని వెనక్కి ఇవ్వరు.
బార్ల లెసైన్స్ ఫీజు ఇలా...
నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 46 బార్లు ఉన్నాయి. వీటికి ఈ ఏడాది నూతన లెసైన్స్‌ఫీజు విధానం అమల్లోకి రానుంది. జనాభా నిష్పత్తి ప్రకారం లెసైన్స్ రెన్యూవల్ ఫీజును విధించారు. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.25 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.38 లక్షలు, 5 లక్షల నుంచి 25 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.48 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
మద్యం దుకాణాలకు మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకొనేవారు ఈనెల 27వ తేదీ సాయంత్రం మూడుగంటల్లోపు పూర్తిచేసిన దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 28వ తేదీ మధ్యాహ్నం రెండుగంటలకు స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో అధికారులు దుకాణాలకు లాటరీ తీయనున్నారు.