చుండూరులో దళితులను చంపిందెవరు?
విశాఖపట్నం: చుండూరు కేసులో అందరూ నిర్దోషులైతే అక్కడ దళితులను చంపిందెవరని చుండూరు ప్రత్యేక కోర్టు ఏపీపీ జి.శివనాగేశ్వరరావు ప్రశ్నించారు. మానవ హక్కుల వేదిక విశాఖపట్నంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ చుండూరు కేసులో నిందితులను వదిలిపెట్టేందుకు వాస్తవాలను మరుగు పరిచారని ఆరోపించారు.
రికార్డుల్లో లేని విషయాలను ఉన్నట్లుగా పొందుపర్చారన్నారు. దేశం మొత్తం మీద అగ్రకులాలు దళితులపై 85 మారణకాండలు జరిపితే అన్ని కేసులలో వారు నిర్దోషులుగా బయటపడ్డారని తెలిపారు. అదే దళితులు అగ్రవర్ణాలపై చేసిన 17 దాడుల్లో దోషులుగా శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు.
చుండూరు దళిత పోరాట కమిటీ అధ్యక్షుడు జాలాది మోజెస్ చుండూరు మారణకాండ జరిగిన తీరుతెన్నులను, పోరాటాలను వివరించారు. మావన హక్కుల వేదిక కార్యవర్గసభ్యులు కె.సుధ, ప్రధానకార్యదర్శి కృష్ణ, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సి.ప్రజ్ఞ, డాక్టర్ ఆడమ్స్ పాల్గొన్నారు.