కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: ప్రతి ఏటా ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతుండటంతో సతమవుతున్న రైతన్నను పురుగు మందుల ధరలు కూడా వెక్కిరిస్తున్నాయి. 15 నుంచి 20 శాతం వరకు కంపెనీలు ధరలను పెంచి రైతులపై భారం మోపుతున్నాయి. కంపెనీలు ధరలు పెంచితే తామేమి తక్కువ కాదన్నట్లు డీలర్లు వాటి ధరలను ఎవరికి వారుగా ఒక్కో రకంపై రూ.50 నుంచి రూ.100లు పెంచుకుని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి, పత్తి, మిరప, ఉల్లితోపాటు పలు రకాల పంటలు సాగయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చీడపీడలు అధికమయ్యాయి. వీటి నివారణకు పురుగు మందులు చాలా అవసరం. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగి సతమవుతున్న రైతులను క్రిమిసంహారక మందుల కంపెనీలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ప్రతి ఏటా విత్తనాల ధరలు రైతన్నను బెంబేలెత్తిస్తున్నాయి.
ఇది చాల దన్నట్లు రెండు,మూడు నెలలకోసారి ఎరువుల ధరలు కాస్త తగ్గడం, మళ్లీ అమాంతంగా పెరుగుతుండడంతో రైతులు పంటల సాగుకు ముందుకు రావడం లేదు. ఈ తరుణంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 నుంచి 20 శాతం వరకు పురుగు మందుల ధరలు పెంచి రైతన్న నడ్డివిరుస్తున్నారు.
రూపాయి ధర పతనం కావడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీల ప్రతినిధులు ప్రకటిస్తున్నారు. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతున్నారు. కొత్త ధరలను ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను మినహాయించి కొత్తగా వచ్చిన మందులను పెరిగిన ధరలకు అనుగుణంగా విక్రయించుకోవాలని డీలర్లకు సూచిస్తున్నారు. పులివెందుల, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, పోరుమామిళ్ల, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, కడప, కమలాపురంలో వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి.
ఈ డివిజన్లలో దాదాపు 262 పురుగు మందుల దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల నుంచి చీడపీడల నివారణకుగాను రూ.24 కోట్ల నుంచి రూ.30 కోట్ల విలువ చేసే పురుగు మందులను రైతులు వాడుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా పత్తి పంటతో పాటు కూరగాయలు, పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఆయా పంటల సాగు మొదలుకుని నూర్పిడి వరకు 10-15 సార్లు మందులను పిచికారి చేయాల్సి ఉంటుంది. అన్ని పంటలకు తప్పనిసరిగా వాడే ఇమిడాక్లోఫ్రిడ్, ఎసిటామిఫ్రైడ్ మందుల ధరలు బాగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం జిల్లా రైతులపై రూ. 4 నుంచి రూ.6 కోట్ల అదనపు భారం పడనుంది. పురుగు మందుల ధరలు పెరగం పట్ల రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
పట్టించుకోని వ్యవసాయాధికారులు
పురుగు మందులను డీలర్లు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నా వ్యవసాయ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. డీలర్లు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతూ తమను పట్టించుకోవడం మానేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే ఆందోళనలు చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఎవరి రేట్లు వారివే...
Published Mon, Sep 16 2013 3:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement