నెల్లూరు: కరోనా వైరస్ అనేది ఊహించని విపత్తని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. ఏపీలో ఈ వైరస్ ఎక్కువ మందికి సోకకుండా నిరోధించడానికి సీఎం జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ముందస్తు చర్యలు మంచి ప్రయోజనం ఇస్తున్నాయన్నారు. కాగా, ఒక్కసారిగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంపై మంత్రి ఆళ్లనాని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటివరకూ రాష్ట్రంలో 23 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, ఇవాళ ఒక్కసారిగా ఆ సంఖ్య 40కి చేరిందన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారితోనే ఒక్కసారిగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయన్నారు. (ఢిల్లీ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి 1030 మంది!)
ఢిల్లీకి వెళ్లివచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైనా దానిని నెగిటివ్ మార్చిన ఘనత జిల్లా యంత్రాంగానిదేనన్నారు. ఇందుకు వారి అందర్నీ అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి 30, 995 మంది విదేశాల నుంచి వచ్చారని, వారిలో 30, 693 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు 30 మంది ఐపీఎస్ అధికారులను నియమించామని, పట్టణాలు, నగర పాలక సంస్థలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా నిర్ధారణ ల్యాబ్ ల సంఖ్య పెంచడంతో పాటు అవసరమైన వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని,
ప్రజలను ఇళ్లలో ఉంచడం అంటే తాళాలు వేయడం కాదన్నారు. వారికవసరమైన నిత్యావసరాలను అందజేయడం కూడా ప్రభుత్వ బాధ్యతేనన్నారు. కరోనా నివారణలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వైద్యులు పారిశుద్ధ్య సిబ్బంది సహా అందరినీ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించామని, దుకాణాల ముందు ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఆళ్లనాని హెచ్చరించారు. (సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment