కాకినాడ : సముద్రంలో వేటకు వెళ్ళి తుపానులో చిక్కుకుని మృతి చెందిన మత్స్య కారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్రనేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. హుదూద్ తుపాన్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన విధంగా ఇటీవలి తుపాన్ మృతుల కుటుంబాలకు కూడా రూ.ఐదులక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత వారం సంభవించిన తుపాను కారణంగా మృతి చెందిన జిల్లాలోని వివిధ మత్స్యకార కుటుంబాలను ఆయన శనివారం పరామర్శించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పగడాలపేట, ఉప్పలంకల్లోని ఏడు కుటుంబాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, రూరల్ కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణులతో కలిసి పరామర్శించారు.
పార్టీ ద్వారా సమకూర్చిన బియ్యాన్ని ఒక్కో కుటుంబానికి 50 కేజీల చొప్పున అందజేశారు. అక్కడి నుంచి కాకినాడ పర్లోపేటలో మృతి చెందిన మరో మత్స్య కారుని కుటుంబాన్ని, అనంతరం తుని నియోజకవర్గంలోని పెరుమాళ్ళపురం, హుకుంపేటల్లోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. మత్స్యకారుల మరణానికి దారి తీసిన పరిస్థితులను, ప్రభుత్వం ద్వారా అందించిన సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ తరఫున బియ్యం సమకూర్చిన పార్టీ నేతలు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం మోపిదేవి మాట్లాడుతూ ప్రస్తుతం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు మాత్రమే పరిహారం ఇవ్వడం సరికాదన్నారు. అదనపు పరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్టీ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మృతి చెందిన మత్స్యకార కుటుంబాలు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. త్వరలోనే తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నారని చెప్పారు. జగన్ నేతృత్వంలో మత్స్యకారులకు న్యాయం జరిగేలా గట్టిగా పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీమారావు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి అల్లి రాజబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్రినారాయణరావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, చింతా కామేష్ తదితరులు ఉన్నారు.
మత్స్యకారులకు పరిహారంలో ఎందుకీ వివక్ష?
Published Sun, Jun 28 2015 2:08 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM
Advertisement
Advertisement