మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు | Mopidevi Venkataramana Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

Published Wed, Sep 15 2021 4:07 AM | Last Updated on Wed, Sep 15 2021 7:28 AM

Mopidevi Venkataramana Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి,అమరావతి: మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటూ మరింత మే లు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మత్స్యకారులతో పాటు యావత్తు బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు.  తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  మంగళవారం మోపిదేవి మాట్లాడారు. 

తోకలు కత్తిరిస్తాననలేదా?
టీడీపీ, బీజేపీలు మత్స్యకారులకు అనుకూలమా? లేక దళారులకు అనుకూలమా? అని మోపిదేవి ప్రశ్నించారు. మత్స్యకారుల నోరు కొట్టి దళారులకు దోచిపెట్టాలన్నదే మీ విధానమా? అని నిలదీశారు. మత్స్యకారులకు రూ.15 వేలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రతిపక్షాల గగ్గోలు ఎందుకన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా మత్స్యకారుల బట్టలూడదీస్తానని, తోకలు కత్తిరిస్తానని విశాఖలో బెదిరించినప్పుడు బీజేపీ నేతల నోరు ఎందుకు పెగలలేదని ప్రశ్నించారు. మత్స్యకారుల సంక్షేమానికి ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

వంద హెక్టార్లకు మించిన చెరువుల నిర్వహణ పేరుకు మాత్రమే మత్స్యకార సొసైటీల పరిధిలో ఉందని, పెత్తనం అంతా దళారులదేనన్నారు. ఈ దుస్థితిని మార్చేందుకు 217 జీవో ద్వారా నెల్లూరు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద 27 చెరువులను బహిరంగ వేలం ద్వారా ఇస్తే ప్రతిపక్షాలు ఎందుకు రగడ సృష్టిస్తున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాయటాన్ని తప్పుబట్టారు. మత్స్యకార సొసైటీల సభ్యులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాల్సిందేనని, వ్యతిరేకించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. 

ఆక్వాకు సబ్సిడీలు... 
అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం, ఉప కులాలైన మత్స్యకార వర్గాలు, చెరువుల మీద ఆధారపడి జీవించే కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆక్వా రంగంపై ఆధారపడి జీవించేవారికి పవర్‌ టారిఫ్‌ కింద సబ్సిడీలు ఇస్తున్నామన్నారు. ఆక్వా ఉత్పత్తులను పెంచేందుకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్‌ అందిస్తున్నామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement