
దున్న ఈనిందని ఎల్లో మీడియా అంటే..దూడను కట్టేయమంటూ టీడీపీ వత్తాసు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ధర్నాలో వైఎస్సార్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ పాల్గొంటే ఎల్లో మీడియాకు ఎందుకంత అక్కసని ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ప్రశించారు. ‘దున్న ఈనిందని ఎల్లో మీడియా ప్రసారం చేస్తే... దూడను కట్టేయమంటూ టీడీపీ వత్తాసు పలికినట్లుంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. సోనియాగాంధీని శుక్రవారం రాత్రి 10గంటలకు విజయమ్మ కలుస్తున్నారంటూ ఒక చానల్ ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేయడం...దాన్ని పట్టుకొని టీడీపీ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి పిచ్చికూతలు కూస్తున్నారు. ఢిల్లీ వెళ్లిందే సోనియాకు కృతజ్ఞతలు తెలపడానికంటూ మాట్లాడుతున్నారు. కానీ విజయమ్మ ఈరోజు సాయంత్రం 5గంటలకే తిరుగు ప్రయాణం చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా గురువారం సాయంత్రమే విమాన టిక్కెట్లు బుక్‌చేసుకున్నారని తెలిపారు.అందుకు సంబంధించిన పత్రాలను మీడియాకు ఆమె మీడియాకు చూపించారు.
ఇలా రోజూ ఎన్నో అసత్యాలు చెబుతున్నా తాము నోటితో ఖండించుకోవాల్సి వస్తోందని, అయితే ఈ విషయంలో ఆధారాలు ఉండటంతో వారి నైజాన్ని నిరూపించగలుగతున్నామని వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీపై ఎల్లోగ్యాంగ్ రకరకాల కథనాలను వండి వార్చడం, దాన్ని పట్టుకునే టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి దుమ్మెత్తిపోయడం ఆనవాయితీగా కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి లభిస్తున్న ఆదరణను తగ్గించేందుకు మరుగుజ్జు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సోనియాకు కృతజ్ఞతలు చెప్పేది మీరే
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం టీడీపీకే ఉందని పద్మ అన్నారు. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 16 నెలలు జైల్లో ఉంచినందుకు సోనియాకు మీరే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులపై దర్యాప్తు జరగకుండా సోనియా కాళ్లు పట్టుకున్నది మీరే. వైఎస్సార్‌సీపీకి ఆ అవసరం లేదు. మేమేదైనా చెప్పుకోవాల్సింది ఉంటే సుప్రీంకోర్టుకే కృతజ్ఞతలు చెప్పుకుంటాం. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు సుప్రీంకోర్టు నిర్దిష్ట కాలపరిమితి విధించినందున, ఆ ఆదేశానుసారం సీబీఐ విచారణ పూర్తవగానే కింది కోర్టు బెయిల్ మంజూరు చేసినందుకు న్యాయస్థానాలకు కృతజ్ఞతలు చెబుతాం’ అన్నారు.
‘‘ఏదో ఒక రోజు తప్పకుండా ధర్మం, న్యాయం గెలవనున్నాయని చట్టాలు, న్యాయస్థానాల మీద మాకున్న గౌరవంతో మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. అలాగే జరిగింది. కానీ 16 నెలల తర్వాత జగన్ బయటికొస్తే దాన్ని కూడా కుమ్మక్కనడం చూస్తే న్యాయస్థానాల పట్ల టీడీపీకి, ఎల్లో మీడియాకు ఉన్న గౌరవమేంటో తెలుస్తోంది. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే నిజమైపోతుందనే అభిప్రాయంతో టీడీపీ, ఎల్లో మీడియా కూడబలుక్కుని గోబెల్‌స ప్రచారం చేస్తున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు.