
ప్రజల్లో గెలవలేకే జగన్‌పై కుట్రలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కలసికట్టుగా ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినా, మరెన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మడమ తిప్పని ధీశాలి అని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేసుల విషయంలో జగన్ ఎప్పుడూ భయపడలేదని, ఎవరికీ లొంగలేదని స్పష్టంచేశారు. ‘‘ఒక దినపత్రికలో మళ్లీ వైఎస్ జగన్‌పై వచ్చిన ఓ కథనంలో 2008 నుంచి 2010 వరకు 16 కంపెనీల ద్వారా పెట్టుబడులు వచ్చేశాయని రాశారు.
సీబీఐ ఎంక్వైరీ సమయంలో కూడా సీబీఐ అలా చెప్పిందని, ఇలా చెప్పిందని రోజుకో కథనం రాసిన ఆ పత్రికలు అదే విధానాన్ని మళ్లీ ఇప్పుడు ఎందుకు మొదలుపెడుతున్నాయో గమనించాల’’ని ప్రజలను కోరారు.ఇంతమంది కలిసి జగన్‌పై దాడి చేయటానికి కారణం ఆయనకు ప్రజాదరణ ఉండటమేనని ఆమె తెలిపారు. వైఎస్సార్‌సీపీ బీఫాంపై గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అధికార సభ్యుల స్థానాల్లో కూర్చోబెట్టడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఇవ్వటం అనేది రాజ్యాంగమంటే లెక్కలేనితనమని పద్మ మండిపడ్డారు.
కుట్రలతో ఎవ్వరూ ఏంచేయలేరు..
అధికారం ఉందని కక్ష రాజకీయాలు చేస్తున్నారని, కుట్రలతో జగన్‌ను ఎవ్వరూ ఏమీ చేయలేరని స్పష్టంచేశారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరవొచ్చనే చంద్రబాబులా జగన్ ఏనాడూ వ్యవహరించలేదన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామాలు చేశాకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులను పార్టీలోకి తీసుకున్నారని గుర్తుచేశారు. ఎవ్వరికీ లొంగకుండా, ఎవరి ముందు తాకట్టు పెట్టకుండా ప్రజల కోసం నిలబడ్డ నాయకుడికి వైఎస్సార్‌సీపీ శాల్యూట్ చేస్తోందన్నారు.