''సబ్బంహరిది రాజకీయ ఆత్మహత్యే'
హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ విశాఖపట్నం లోకసభ అభ్యర్ధి సబ్బం హరిపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డిపద్మ నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సబ్బంహరి పోటీ నుంచి తప్పుకుని రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు అని వాసిరెడ్డి పద్మ అన్నారు.
విశాఖలో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ సబ్బంహరి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆమె అన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడానన్న సబ్బంహరి విభజనకు కారకులైన టీడీపీ-బీజేపీలకు మద్దతెలా ఇస్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అండ, చలువతో రాజకీయాల్లో చక్రం తిప్పిన సబ్బంహరి వైఎస్ విజయమ్మపై బురద జల్లడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలోనే కాదు చాలా చోట్ల జేఏసీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని టీడీపీకి సహకరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.