మైదుకూరు టౌన్: భర్తను కాదని వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తనను భర్త ఎలాగైనా చంపేస్తాడనే భయంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళ ఉదంతమిది. మైదుకూరు మండల గంగవరం గ్రామానికి చెందిన అందె లక్ష్మినరసయ్య(47) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు మైదుకూరు డీఎస్పీ బి.ఆర్. శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మైదుకూరు మండలం గంగవరం గ్రామానికి చెందిన అందె లక్ష్మినరసయ్యకు 25 ఏళ్ల క్రితం రమణమ్మతో వివాహమైంది. వీరికి కూతురు జయలక్ష్మి, కుమారుడు సురేష్‌బాబులు ఉన్నారు. అయితే భార్య ప్రవర్తనను అనుమానించిన లక్ష్మినరసయ్య రమణమ్మను కువైట్‌కు పంపాడు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు 2003లో హత్యకు గురయ్యాడు. కుమారుడి మృతి అనంతరం భార్యభర్తల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం కువైట్ నుంచి వచ్చిన రమణమ్మ మైదుకూరులోనే నరసింహులు అలియాస్ సన్నోడు అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తనను ఎలాగైనా భర్త చంపుతాడనే భయంతో రమణమ్మ ప్రియుడు సన్నోడుతో కలిసి భర్తను హత్య చేయాలని పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈనెల 10వతేదీ సాయంత్రం అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కశెట్టి వెంకటేష్‌ను గ్రామంలోకి పంపించి అతని ట్రాక్టర్‌లో లక్ష్మినరసయ్యను పిలుచుకుని రమ్మని చెప్పారు. ఆ మేరకు వెంకటేష్ తన ట్రాక్టర్‌లో లక్ష్మినరసయ్యను ఎక్కించుకొని వనిపెంటలోని ఓ వైన్‌షాపులో మద్యం తాపించి బ్రహ్మంగారి మఠం వెళ్లే దారివైపు తీసుకెళ్లాడు.
బహిర్భూమికి వెళ్లాలనే సాకు చూపి ట్రాక్టర్‌ను డ్రైవర్ తెలుగుగంగ కాలువ వద్ద ఆపాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడ మాటు వేసి ఉన్న సన్నోడు తన వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మినరసయ్య తలపై నరికాడు. అంతేకాకుండా కసితీరా గొంతు కోసి కాలువలో పడేశాడు. నిందితులు సన్నోడు,రమణమ్మ, ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారు ఉపయోగించిన ట్రాక్టర్, కత్తి, ద్విచక్రవాహనం, 3సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు రామకృష్ణ, లక్షుమయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment