పశ్చిమగోదావరి : అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి మృతి చెందిన నున్నా అరుణకుమార్ కేసులో పోలీసులు కంచనగూడెం గ్రామానికి చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కంచనగూడెం వెదుళ్ళమెట్ట సమీపంలో వేటగాళ్ళు వన్య ప్రాణుల కోసం ఈ నెల 20 వ తేదీ రాత్రి ఈది కృష్ణకు చెందిన పొలంలో విద్యుత్ తీగలు అమర్చారు. గ్రామానికి చెందిన నున్న అరుణకుమార్ ఈ విషయం తెలియక తన పొలంలోకి బయలుదేరాడు. మధ్యలో కరెంట్ తీగలు తగిలి షాక్‌గురై మృతి చెందాడు.
ఈ విషయాన్ని గమనించిన వేటగాళ్లు సాక్ష్యాలను తారుమారు చేసే ఉద్దేశంతో అరుణకుమార్ మృతదేహాన్ని కొద్ది దూరంలో ఉన్న నక్కా లక్ష్మీ కాంతం పొలంలో పడేశారు. మృతుని తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలవరం సిఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వీఎస్ వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణ అనంతరం సంఘటనకు కారణమైన వన్య ప్రాణులను వేటాడే కొత్తపల్లి గాంధి, నీలం సూరిబాబు, మేడూరి చంటి, తన పొలంలో విద్యుత్ వైర్లు పెట్టుకోవడానికి అనుమతించిన ఈది కృష్ణలను అరెస్ట్ చేసినట్లు డీఎస్‌పి వెంకట్రావు తెలిపారు. వీరితో పాటు మరో 9 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.