
విదేశీ కంపెనీల ఒప్పందాలన్నీ బయటపెట్టాలి: ధర్మాన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నీ తక్షణమే బయటపెట్టాలని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద రావు డిమాండ్ చేశారు. ఒప్పందాలపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీతో సహా పౌరులందరికీ సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కేంద్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల చట్టాల పరిధిలో లేని అంశాలపై కూడా ఒప్పందాలు జరుగుతున్నట్లు అనుమానాలున్నాయని చెప్పారు. చంద్రబాబు పేరుప్రతిష్టల కోసం అడ్డగోలు రాయితీలిచ్చి విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం సరికాదన్నారు.
'చంద్రబాబు.. మీ పాలన నాలుగేళ్లు మాత్రమే' అంటూ ధర్మాన మండిపడ్డారు. గుదిబండ్లలాంటి ఒప్పందాలు ప్రజలకు శాపంలా మారుతాయని హెచ్చరించారు. స్వదేశీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిపోయి విదేశీ పెట్టుబడుల కోసం అడ్డగోలు రాయితీలివ్వడం సరికాదని ధర్మాన విమర్శించారు.