రాజధాని పేరుతో ఇన్ని ఘోరాలా ? | Minister Dharmana Prasada Rao in Assembly on Inner Ring Road Scam | Sakshi
Sakshi News home page

రాజధాని పేరుతో ఇన్ని ఘోరాలా ?

Published Thu, Sep 28 2023 4:10 AM | Last Updated on Thu, Sep 28 2023 3:50 PM

Minister Dharmana Prasada Rao in Assembly on Inner Ring Road Scam - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కారు పాల్పడిన ఘోరాలు విస్తుగొల్పుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అధికార రహస్యాలను బయట పెట్టబోమని ప్రమాణం చేసిన నాటి మంత్రులు ప్రజలకు ఇంత అన్యాయం చేయడం దారుణమన్నారు. అమరా­వతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు కుంభకోణంపై అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ధర్మాన మాట్లా­డారు. టీడీపీ సర్కారు రాజధానిపై ఏనాడూ ఒక పద్ధతిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు వినియోగించుకునే అవకాశం ఉన్నా చంద్రబాబు తప్పు చేసి దొరికిపోవడంతో మూటాముల్లె సర్దుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారని చెప్పారు.

హైదరాబాద్‌లో చేసినట్లు­గానే అమరావతిలోనూ భూముల దోపిడీకి పాల్పడ్డారన్నారు. రాజధానిపై కేంద్రం నియ­మిం­చిన నిపుణుల కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైన కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. 2013 చట్టంలోనే భూసమీకరణకు అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టారని, ప్రభుత్వాలు ఇంత అధర్మంగా వ్యవహరించవచ్చా? అని ప్రశ్నించారు. మిగ­తావారిని దారి మళ్లించి తాము ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతంలో భూములు కొన్నా­రని తెలిపారు.

తొలుత అతి చౌకగా జిరాయితీ భూములు కొన్నారని, ఆ తర్వాత జీవో 1 విడుదల చేసి అన్ని కేటగిరీల భూములకు భూ సమీకరణ ప్యాకేజీని పేర్కొంటూ అసైన్డ్‌ భూముల దగ్గర మాత్రం ఖాళీగా వదిలేశారని తెలిపారు. వాటికి రిజిస్ట్రేషన్‌ జరగదని తెలిసి కూడా వారిని కార్యాలయాలకు రప్పించి రిజి­స్ట్రేషన్లను తిరస్కరించేలా చేశారని చెప్పారు. అసైన్డ్‌ భూములకు ఎలాంటి ప్యాకేజీ రాదంటూ మూడు మండలాల్లోని అసైన్డ్‌ రైతులను భయ­పెట్టి బాబు బృందం దక్కించుకుందన్నారు.

ఆ భూములకు లభించే కౌలు, వన్‌టైమ్‌ బెనిఫిట్‌­ను తమకు అందేలా చంద్రబాబు మనుషులు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి నారాయణ కాలేజీకి సైతం డబ్బులు జమ అయ్యాయని, పేద రైతులను మాయచేసి దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూములు తమ చేతికి వచ్చిన తర్వాత వాటికి జీవో 1 వర్తించదు కాబట్టి ఏడాది తరువాత తాపీగా జీఓ 41 తీసుకువచ్చారని చెప్పారు. అసైన్డ్‌ రైతులను భయపెట్టేందుకే ఆ జీఓను ఒక సంవత్సరం పాటు ఆపారని తెలిపారు.

రెవెన్యూ శాఖ ఇవ్వాల్సిన జీవోను మున్సిపల్‌ శాఖ ఇచ్చేసింది
అసైన్డ్‌ భూములకు సంబంధించిన జీవోను రెవెన్యూ శాఖ ఇవ్వాల్సి ఉండగా మున్సిపల్‌ పరిపాలన శాఖ ఇచ్చిందని మంత్రి ధర్మాన తెలిపారు. పేదల భూములను బోగస్‌ వ్యక్తుల పరం చేయటాన్ని అధికారులంతా వ్యతిరేకించినా గత సర్కారు లెక్కచేయలేదన్నారు. మూడు మండలాల్లో అసైన్డ్‌ రికార్డులను సైతం మాయం చేశారని తెలిపారు. ప్రస్తుతం భూములు ఎవరి వద్ద ఉన్నాయో వారికే హక్కులు ఇద్దామంటూ తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు తమ మనుషులను ప్రవేశపెట్టారని చెప్పారు. పీఓటీ చట్టానికి వ్యతిరేకంగా, రెవెన్యూ శాఖకు తెలియకుండా మాజీ మంత్రి నారాయణ ఇవన్నీ చేశారన్నారు.

జీవో వచ్చిన 22 రోజుల తర్వాత నాటి సీఎం దీన్ని అంగీకరించారని, చట్టానికి వ్యతిరేకంగా ఈ జీవో జారీ అయిందన్నారు. ప్రజల క్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున దోపిడీ చేస్తుంటే దాని పట్ల విశ్వాసం ఏముంటుందని ప్రశ్నించారు. అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయం అనుకూలంగా ఇవ్వలేదని ఆయన్ను తీసేశారని, న్యాయ శాఖ కార్యదర్శి, కలెక్టర్, సీఆర్‌డీఏ కమిషనర్‌ అందరూ వ్యతిరేకించినా దోపిడీని కొనసాగించారని తెలిపారు. ఇంత అడ్డగోలుగా వచ్చిన భూమి ప్లాట్లను కోర్‌ క్యాపిటల్‌లోని సచివాలయం, గవర్నర్‌ బంగ్లా, అసెంబ్లీ ఉన్నచోట ఇచ్చారని, ఇది ఎంత ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని రైతుల పొట్టగొట్టి గొడవలా?
అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు తెలిశాయని, ఇన్ని ఘోరాలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు తాను అవినీతిపరుడిని కాదని ఎలా చెప్పుకుంటారని ధర్మాన ప్రశ్నించారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయేలా ఇవన్నీ చేశారన్నారు. పోయిన విశ్వాసాన్ని మళ్లీ కల్పించేందుకు ఇప్పుడు సీఎం జగన్‌ 50 వేల మందికి అక్కడే ఇళ్ల స్థలాలిచ్చారని తెలిపారు. రాజధాని రైతుల పొట్ట గొట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు తాము రైతులమంటూ గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ సరి చేయడానికి సీఎం జగన్‌ ఎంతో కృషి చేశారని, ఒక ప్రభుత్వం తప్పు చేసి వ్యవస్థపై విశ్వాసాన్ని పోగొడితే మళ్లీ ఆ విశ్వాసాన్ని నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

హెరిటేజ్, నారాయణ కోసం ఇన్నర్‌ ప్లాన్‌ మార్చారు: ఎమ్మెల్యే పేర్ని నాని 
రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణంతో తనకు సంబంధం లేదన్న వ్యక్తి ఇప్పుడు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశారు. చంద్రబాబు సర్కారు అవినీతి చిట్టాలో ఇన్నర్‌ రింగు రోడ్డు ఒకటి. దోపిడీ దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్‌ రోడ్డు స్కామ్‌ జరిగింది. మొదట ఇది మంత్రివర్గ నిర్ణయమని చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో స్కామ్‌ నడిపించారు. లింగమనేని రమేష్‌ పొలం మధ్యలో నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వచ్చేలా, హెరిటేజ్‌ సంస్థ, నారాయణ కాలేజీల కోసం అలైన్‌మెంట్‌ ప్లాన్‌ మార్చారు. ఐఆర్‌ఆర్‌తో తనకేం సంబంధం అంటున్న ఏ–14 నారా లోకే‹శ్‌ 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఆయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు. ఆ తీర్మానంపై లోకేష్‌ సంతకం చేశారు. దళితులు, పేదల నుంచి చంద్రబాబు, నారాయణ అసైన్డ్‌ భూములను లాక్కున్నారు. కేసులు ఎక్కువ నమోదైన వారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తామన్న లోకేష్‌ ఇప్పుడు ఎక్కడున్నారు? యువతను రెచ్చగొట్టి ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371 కోట్లు టిప్‌ అని అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు? ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును అటూ ఇటూ తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే తన కరకట్ట ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్లు లింగమనేని హైకోర్టులో చెప్పారు.

బాబుకు సీఎం పదవి పోయిన వెంటనే లింగమనేనికి అద్దె కింద రూ.27 లక్షలు ఇచ్చామని భువనేశ్వరి చెబుతున్నారు. నిజంగానే అధికారికంగా ఇచ్చి ఉంటే అద్దె ఎందుకు చెల్లించారు? ఐటీ రిటరŠన్స్‌లో ఈ వివరాలను వెల్లడించారా? రూ.27 లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు ఎందుకు మాట్లాడడం లేదు? రాజధానిపై నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు తుంగలో తొక్కి, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఏర్పాటుకు జీవో ఇచ్చారు. భూసమీకరణకు ఒప్పుకోని వారిని ఏ–2 నారాయణ, ఏ–14 లోకేష్‌ బెదిరించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం లాక్కుంటుందని భయపెట్టారు. ఎకరం భూమిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే రాయించుకున్నారు. అసైన్డ్‌ రైతులను దగా చేసిన ఇలాంటి వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే.

సమగ్ర విచారణ జరగాలి: వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే
ఇన్నర్‌ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు, స్కిల్‌ డెవలప్‌మెంట్, ఫైబర్‌ నెట్‌ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలి. రాజధానిని ప్రకటించకముందే లింగమనేని రమేష్‌ 355 ఎకరాలను కొనేశారు. పేదలను మోసం చేసి కంతేరు వద్ద భూముల్ని హెరిటేజ్‌ కొనడం ఏమిటి? ఢిల్లీ కోటను ఢీకొన్న జగన్‌ కళ్లల్లో భయం చూపిస్తానని లోకే‹శ్‌ అంటున్నారు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జగన్‌ ఎక్కడ? ఆయనకు ఉన్న  175 మంది సైనికుల్లో ఒకరి చేతుల్లో ఓడిపోయిన లోకే‹శ్‌ఎక్కడ? 

మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు: ఆదిమూలపు సురేష్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి 
రాజధాని పేరుతో ప్రజలను మోసం చేసిన మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు. ఇన్నర్‌ రింగు రోడ్డు అనకొండలా మలుపులు తిరుగుతూ కొందరు వ్యక్తుల పొలాల దగ్గరకు వచ్చి ఆగింది. ఇందులో చేయని మోసం అంటూ ఏదీ లేదు. టెండర్లు పిలవకుండా నచ్చిన వాళ్లకు నామినేషన్ల విధానంలో పనులు అప్పగించారు. ముగ్గురు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం అలైన్‌మెంట్‌ను మార్చారు. గ్రాఫిక్స్‌తో అమరావతిని అంతర్జాతీయ నగరం అని నమ్మించడానికి ప్రయత్నిస్తే అది అంతర్జాతీయ స్కామ్‌ అయింది. ఈ స్కామ్‌కి డైరెక్షన్‌ చంద్రబాబుది అయితే పర్యవేక్షణ లోకేశ్, నాటి మంత్రులు, ఇతరులది. అమరావతిలో దళిత, పేద రైతుల్ని నిలువునా ముంచారు.

నవ నగరాలు, ఐకానిక్‌ బ్రిడ్జి లాంటివన్నీ బూటకం. ఇన్నర్‌ రింగురోడ్డు గురించి కాగ్‌ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ల విధానంలో సుర్బానా, జురాంగ్‌ కంపెనీలకు ప్లాన్‌ తయారీ బాధ్యతను అప్పగించి రూ. 28 కోట్లు రూల్స్‌కి విరుద్ధంగా చెల్లించినట్లు కాగ్‌ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఇన్నర్‌ రింగు రోడ్డులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటున్న వారు ఈ డబ్బు గురించి సమాధానం చెప్పాలి. ఎస్‌టీయూపీ అనే కంపెనీకి మాస్టర్‌ప్లాన్‌ తయారీకి రూ.5 కోట్లు ఇచ్చారు. ఇవి డబ్బులు కాదా? రింగురోడ్డు తుది అలైన్‌మెంట్‌ను లింగమనేని, హెరిటేజ్‌ భూముల గుండా మార్చారు.

హెరిటేజ్‌ భూములు కాజ, కంతేరు, చినకాకాని వద్ద ఉండడంతో రింగురోడ్డు అటు వెళ్లింది. అలైన్‌మెంట్‌ మార్పు చేసి తనకు సహాయం చేసినందుకే లింగమనేని రమేష్‌ ప్రతిఫలంగా చంద్రబాబుకి కరకట్ట నివాసాన్ని ఇచ్చారు. క్విడ్‌ప్రోకు ఇది తిరుగులేని ఉదాహరణ. నారాయణ తన వద్ద పనిచేసిన ఉద్యోగి పేరు మీద భూమిని కొని తర్వాత తన పేరిట మార్చుకున్నారు. అడ్డంగా దొరికిన అవినీతిపరులను వదిలిపెట్టేది లేదు. ఆధారాలతో చట్టం ముందు నిలబెడుతున్నాం. చంద్రబాబు, లోకే‹శ్‌ను చట్ట ప్రకారం శిక్షించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement