పరిగి, న్యూస్‌లైన్: సారా మహమ్మారి జనాన్ని మింగుతోంది. దానికి బానిసైన ప్రజలు మృత్యువాత పడుతున్నా సంబంధిత అధికారులు చేష్టలుడిగి నిమ్మకు నీరెత్తారు. కుటుంబాలు ఛిద్రమవుతున్నా ఎవరికీ పట్టడం లేదు. తరచు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే సారా ఇద్దరిని బలిగొంది. ఈ నెల 1న పరిగి పట్టణంలో సారా తాగి ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మండల పరిధిలోని రావులపల్లిలో గుడుంబా తాగి ఓ వ్యవసాయ కూలీ దుర్మరణం పాలయ్యాడు. దీన్ని బట్టి సారా మహమ్మారి ఏ మేర తన ప్రతాపం చూపుతోందో అవగతమవుతోంది.
హోటళ్లలా సారా దుకాణాలు
గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా సారా విక్రయ కేంద్రాలు హోటళ్లలా వెలిశాయి. చిన్న గ్లాసుల నుంచి అర లీటర్, లీటర్ ప్యాకెట్లలో రూ. 10 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. కొందరు సారాను తండాల్లో తయారు చేస్తూ గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఎక్సైజ్ అధికారులు విక్రయకేంద్రాలపై దాడులు చేసి ‘మమ..’ అనిపిస్తున్నారు. సారా తయారీదారుల నుంచి అధికారులు ‘అమ్యామ్యాలు’ తీసుకొని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
యువతకు లభించని మద్దతు..
సారా మహమ్మారిని పారద్రోలేందుకు యువత బాగానే ఉద్యమిస్తున్నా వారికి ప్రోత్సాహం లభించడం లేదు. మద్దతు ఇవ్వాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలుమార్లు యువజన సంఘాల సభ్యులు సారాను పట్టుకొని ధ్వంసం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో గ్రామాల్లో విక్రయిస్తున్న నాటు సారాను పట్టుకుని ధ్వంసం చేస్తున్నారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి సామగ్రి ధ్వంసం చేస్తున్నారు. తరచు ఎక్సైజ్ కార్యాలయాల ఎదుటా ధర్నాలు నిర్వహిస్తున్నా వారికి సరైన మద్దతు లభించడం లేదు. సారా వ్యాపారులకు కొందరు నాయకులు సహకరిస్తున్నారని యువకులు ఆరోపిస్తున్నారు.
జోరుగా నల్లబెల్లం దందా
వ్యాపారులు జోరుగా నల్లబెల్లం, నవసాగరం విక్రయిస్తున్నారు. లొసుగులను అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా తమ దందా సాగిస్తున్నారు. పశువుల దాణా పేరుతో నల్లబెల్లం బెల్లం విక్రయిస్తున్నారు. అది సారా తయారీదారులకు వరంగా మారింది. సారా కోసమే వ్యాపారులు విక్రయాలు జరుపుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇటీవల ఎస్పీ ఆదేశాల మేరకు పరిగిలో ఓ దుకాణంపై దాడి చేసిన స్పెషల్ పార్టీ పోలీసులు వందల క్వింటాళ్ల నల్లబెల్లం బస్తాలు, నవసాగరం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అయినా ఎటువంటి కేసు నమోదు కాలేదని సమాచారం. సారా విక్రయాలపై ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా విస్త్రృతంగా దాడులు నిర్వహిస్తున్నాం. నెలకు సగటున 60 కేసులు నమోదు చేస్తున్నామని చెబుతున్నారు.
విజృంభిస్తున్న సారక్కసి
Published Mon, Dec 30 2013 2:20 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement