కడప సెవెన్‌రోడ్స్ : ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రూ. 1.50 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ రైతుల అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే హామీలకు తిలోదకాలిచ్చారని విమర్శించారు.
కోటయ్య కమిటీని అడ్డుపెట్టుకుని ప్రతి రైతు కుటుంబానికి రూ. 1.50 లక్షలు మత్రమే మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారని పేర్కొన్నారు. అది కూడా వివిధ షరతులను విధించి మాఫీ మొత్తాన్ని కుదించారని తెలిపారు. ఆన్‌లైన్ పని చేయలేదన్న నెపంతో రెవెన్యూ అధికారులు రైతులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకున్నారని పేర్కొన్నారు. రెండు విడతలుగా రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసినప్పటికీ అర్హులైన రైతులకు మాఫీ వర్తించకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.
కౌలుదారులు తీసుకున్న రుణాలు పట్టాదారు పాసుపుస్తకాలతో నిమిత్తం లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో నిమిత్తం లేకుండా రూ.1.50లక్షలు మాఫీ చేయాలన్నారు. పంట రకం, విస్తీర్ణం, వివరాల నమోదులో జరిగిన పొరపాట్లను బ్యాంకుల్లో తక్షణమే సవరణలు చేయించి స్టేట్‌మెంట్లు ఇవ్వాలన్నారు.
ఉద్యాన, వాణిజ్య, వ్యవసాయ అనుబంధ రంగాలపై తీసుకున్న రుణాలను మాఫీ చేయాలన్నారు. రాజధాని నిర్మాణంలో భూములు కోల్పొయే రైతుల తరహాలో జిల్లా రైతాంగానికి కూడా ఒకేసారి రుణమాఫీ మొత్తాన్ని జమచేయాలని కోరారు. ఖరీఫ్ రుణాలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా, వైఎస్సార్ సీపీ రైతు విభాగం నాయకుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం నాయకుడు కట్టా యానాదయ్య పాల్గొన్నారు.
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి
Published Tue, May 5 2015 5:53 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM
Advertisement
Advertisement