- దాడుల సమాచారాన్ని లీక్ చేస్తున్న ఎస్పీ కార్యాలయం కానిస్టేబుల్
- గుడివాడలో ఓ పోలీస్ అధికారి అండదండలు
- రూరల్ స్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ మధ్యవర్తిత్వం
గుడివాడ అర్బన్ : పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లో ఉన్నవారి అండదండలతోనే పట్టణంలో ఓ తెలుగుదేశం నేత పేకాట శిబిరాల దందా కొనసాగుతోంది. జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల పట్టణంలో పర్యటనకు వచ్చినపుడు పోలీసు సూపరింటెండెంట్ స్థానిక సిబ్బందికి సూచిం చారు. అయినప్పటికీ వారి తీరు మారలేదు.
స్థానిక మార్కెట్ యార్డు వద్ద మంగళవారం రాత్రి పోలీసుల సహకారంతో జూద శిబిరా న్ని నిర్వహించడమే ఇందుకు ఉదాహరణ. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి మారుమూ ల ఉన్న పోలీస్‌స్టేషన్ వరకు కొందరు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు ఆ నేత స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నాడు. వారి అండదండలతో జూద శిబిరాల నిర్వహణను విస్తరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కాయ్ రాజా కాయ్’ శీర్షికతో జూద శిబిరాల నిర్వహణపై ‘సాక్షి’లో బుధవారం వచ్చిన వార్త ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
ఎస్పీ ఆఫీసు నుంచే సమాచారం..
ఈ ప్రాంతంలో జూద శిబిరాల నిర్వహణపై స్థానిక పోలీసుల మీద నమ్మకం లేక పట్టణ ప్రజలు పలుమార్లు ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించారు. ఎస్పీ కార్యాల యంలో స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ఈ విషయాన్ని జూద శిబిరాల నిర్వాహకుడికి సమాచారం అందిస్తున్నాడు. ఇందుకుగాను అతడికి రాచమర్యాదలు జరుగుతున్నాయని తెలిసింది.
ఈ దందాను పట్టించుకోకుండా ఉండాలంటే ఎవరికి ఏది ఇచ్చి మచ్చి క చేసుకోవాలో టీడీపీ నేతకు ఆ కానిస్టేబుల్ సలహాలు ఇస్తున్నాడని సమాచారం. పోలీసు శాఖలో ఏ స్థాయిలో వారికైనా రాచ మర్యాదలు చేయడంలో ఆ నేత ఆరితేరినవాడని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. కానిస్టేబు ల్ సలహాలను పాటిస్తూ, ఆదాయాన్ని పెంచుకుంటున్నాడని తెలిసింది. కానిస్టేబుల్ సేవలను మరింతగా వినియోగించుకునేందుకు టీడీపీ నేత తనకున్న రాజకీయ పలుకుబడితో అతడిని గుడివాడకు బదిలీ చేయించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
స్థానికంగానూ ఇదే తంతు..
గుడివాడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లోని ఓ హెడ్ కానిస్టేబుల్‌కు జూద శిబిరాలు నిర్వహించే టీడీపీ నేతతో సంబంధాలు ఉన్నాయని విని కిడి. స్థానికంగా ఉన్న కొందరు అధికారులకు ఏవైనా వసతులు కల్పించాలంటే ఈ హెడ్ కానిస్టేబుల్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది. ఓ అధికారి ఇటీవల పక్క జిల్లాకు వెళ్లేందుకు టీడీపీ నేత కారును ఏర్పా టు చేసినట్లు పోలీసు శాఖలో సిబ్బందే బహిరంగంగా పేర్కొంటున్నారు.
తనకు అనుకూలంగా ఉంటారనుకున్న ఉన్నతాధికారులు బదిలీపై గుడివాడ వస్తున్నట్లు తెలిస్తే వారు ఇక్కడకు రావడానికి కారు, సామగ్రిని తరలించేందుకు లారీని కూడా ఆ నేత ఏర్పాటు చేస్తాడని సమాచారం. ఇవేకాక వారి బంధువుల ఇళ్లలో వేడుకలు జరిగితే క్యాటరింగ్, లైటింగ్ వంటి ఏర్పాట్లను కూడా ఆ నేత ఏర్పాటు చేసి వారి మన్ననలు అందుకుంటున్నట్లు తెలిసింది.
ఇలా స్థానికంగా ఉన్న కొందరు ఉన్నతాధికారులకు రాచమర్యాదలు చేయడం వల్ల ఈయనగారు నిర్వహించే పేకాట శిబిరాల దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఈ దందాపై ఎస్సై స్థాయి అధికారులు ఎవరైనా స్పందిస్తే తనకు అనుకూలురైన ఉన్నతాధికారులతో ఫోన్లు చేయించి వారిని కట్టడి చేస్తాడని సమాచారం.