పనికిమాలిన ఆర్డినెన్స్‌తో భూ సేకరణా?
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజం
మంగళగిరి : పనికిమాలిన ఆర్డినెన్స్‌తో చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణకు దిగడం సిగ్గుమాలిన చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. మండలంలోని నిడమర్రులో సోమవారం సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, అతని అనుచరులు వ్యాపారం చేసుకునేందుకే రాజధాని నిర్మాణం చేపట్టారని విమర్శించారు. వారి ఇష్టానుసారం భూసేకరణకు దిగితే రైతులు చూస్తూ ఊరుకోరని, వెంటనే భూ సేకరణ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తొలుత గ్రామంలోని రామాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. భూ సేకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని, అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఉప సర్పంచ్ గాదె సాగరరెడ్డి, సీపీఎం నాయకులు బాబూరావు, ఎం రవి, రాధాకృష్ణ, వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు మునగాల మల్లేశ్వరరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి పట్టణ కన్వీనర్ బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఎన్ బ్రహ్మయ్య, టి.బాబూరావు, కొండారెడ్డి, కృష్ణ, కుమారస్వామి, ఎన్ విష్ణు, ఎన్ రాజు, బి శంకర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నవులూరులో....
మండలంలోని నవులూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉడా కాలనీ, ఎమ్మెస్సెస్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీలను గ్రామ కంఠాల నుంచి తొలగించి తమకు న్యాయం చేయాని కోరుతూ గ్రామస్తులు సోమవారం సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇళ్లు తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ కార్యాలయం లోపలికి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా డిప్యూటీ కలెక్టర్ రఘునాథరెడ్డి బయటకు వచ్చి మహిళలకు సర్ధి చెప్పారు. నివాసాలను తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళలు ధర్నా విరమించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ బాలాజీనాయక్, ఉప సర్పంచ్ కూచిపూడి రమేష్, వైఎస్సార్ సీపీ నాయకులు మేకల సాంబశివరావు, షఫీ, మాజీ సర్పంచ్ కొల్లి లక్ష్మయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.