
చతుర్వేదాలతో ధ్వనించిన సప్తగిరులు
♦ తొలిసారిగా 1500 మందితో నిర్వహణ
♦ గరుడ వాహనంపై దర్శనమిచ్చిన వేదోద్ధారకుడు
సాక్షి, తిరుమల: చతుర్వేద పారాయణంతో ఆదివారం సప్తగిరులు ధ్వనించాయి. పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఆదివారం రాత్రి గరుడ వాహనంపై మలయప్పస్వామి ఆలయ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులోనే తొలిసారిగా 1,500 మంది వేద పారాయణదారులతో వేద మహోత్సవం పేరుతో నాలుగు వేదాలను పారాయణం చేశారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని ఒక్కో మాడ వీధిలో ఒక్కో వేదాన్ని పండితులు సామూహికంగా పారాయణం చేశారు.
ఒకవైపు గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిస్తూ ఊరేగుతుండగా, మరోవైపు పండితుల సామూహిక వేద పారాయణ ధ్వనులు ఏడుకొండల్లో ప్రతిధ్వనిస్తుండటంతో భక్తకోటి పులకించిపోయింది. వాహన సేవ ఊరేగింపు పూర్తి అయిన తర్వాత వాహన మండపం వద్ద పారాయణదారులు చతుర్వేదాలు పారాయణం చేశారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, అసోం, గోవా వంటి రాష్ట్రాల నుంచి 4 వేదాల పారాయణదారులు పాల్గొన్నారు. కాగా, వేద పరిరక్షణ, వ్యాప్తి, వేద పారాయణదారుల సమస్యలు, పరి ష్కారంపై టీటీడీ అనుసరించాల్సిన తీరు వంటి అంశాలపై ఆదివారం సర్వే చేశారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ సి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.