=నెల రోజుల్లో ఒకే ఇంట ముగ్గురు మృతి
=పి.కొట్నాబిల్లిలో విషాదం
=శంకరం పంచాయతీలో మరొకరు
రావికమతం/మాడుగుల, న్యూస్‌లైన్: ఇటీవల భారీ వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితుల తో వ్యాధులు బసలు కొడుతున్నాయి. ముఖ్యంగా పల్లె ల్లో పారిశుద్ధ్యం కొరవడి అతిసార పడగ విప్పుతోంది. రావికమతం, మాడుగుల మండలాల్లో నలుగురు చనిపోయా రు. రావికమతం మండలంలోని టి.అర్జాపురం శివారు పి.కొట్నాబిల్లి గ్రామంలో అతిసార మహమ్మారి ఒకే కుటుంబంలో ముగ్గురిని కబళించింది. మృతు ల్లో ఇరువురు అన్నదమ్ములు కాగా మరొకరు వారికి మామ. నెల రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా వాంతులు, విరేచనాలతో మృతి చెందారు. దీంతో ముగ్గురు మగదిక్కు కోల్పోయిన తామెలా బతకాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజాగా మంగళవారం సాయంత్రం నుంచి ఇవే లక్షణాలతో బాధపడుతున్న నంద్యాల రాజబాబు (45) బుధవారం రాత్రి మృతి చెందాడు. ఈయనకు ఐదుగురు ఆడపిల్లలున్నారు. వీరు తల్లిని పట్టుకుని రోదించడం పలువురిని కలచివేసింది. వారం రోజుల క్రితం అతిసారతో రాజబాబు తమ్ముడు అప్పారావు మృతి చెందాడు. నెల రోజుల కిందట మృతుల మేనమామ డోలా అర్జున తీవ్ర వాంతులు, విరోచనాలతో కాళ్లు తన్నుకుపోయి మృతిచెందాడని తెలిపారు. అలాగే వీరి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న శీదరి గొంతులమ్మ అతిసారతో బాధపడుతోంది.
ఆమెను చికిత్స నిమిత్తం రావికమతం పీహెచ్‌సీకి, అక్కడ నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంత జరిగినా తమ గ్రామానికి వైద్య సిబ్బందెవ్వరూ రాలేదని వారు వాపోయారు. పంచాయితీ ఉప సర్పంచ్ సన్యాసినాయుడు, సిబ్బంది గురువారం గ్రామానికి వచ్చి బ్లీచింగ్ చల్లి క్లోరినేషన్ చేపట్టారు. మాడుగుల మండలంలో శంకరంలోనూ ఇదే దుస్థితి. గ్రామానికి చెందిన గొర్లె అప్పలస్వామి (65) అతిసారతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదే గ్రామంలో పదిమంది జ్వరాలతో బాధపడుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు అతిసార ప్రబలడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని క్లస్టర్ సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారి పి.శ్రావణ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా,అప్పలస్వామి మోతాదుకు మించి మద్యం సేవించడంతో మృతిచెందాడని తెలిపారు. గ్రామంలో జ్వరాల నియంత్రణకు ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.
పత్తాలేని వైద్యాధికారులు
పి.కొట్నాబిల్లి గిరిజన గ్రామం. ఆపై కొండ పక్కన ఉండటంతో ప్రస్తుత వర్షాలకు గ్రామమంతా నీటితో నిండి ఉంది. ఏ ఇంటి ముందు చూసినా బురద, దుర్గంధం తాండవిస్తోంది. గ్రామస్తులు బోరు, మంచినీటి పథకం నీటిని మరిగించి తాగుతున్నారు. అయినా అతిసార ఎలా ప్రబలిందో అర్థం కావడం లేదని గ్రామస్తులు నంద్యాల రాము, డోలా కళ్యాణం పేర్కొన్నారు. అధికారులు తక్షణమే గ్రామానికి వచ్చి సరైన వైద్యం అందించాలనికోరుతున్నారు.