=5342 ఇళ్లు దెబ్బతిన్నట్లు గుర్తింపు
=పంచాయతీ, మండల కార్యాలయాల్లో వివరాల ప్రకటన
=బియ్యం, కిరోసిన్ కేటాయింపు నేడు
=ఆదివారంలోగా పంపిణీ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వరద నష్టం అంచనా పూర్తయింది. పంట నష్టం మినహా.. తొలి దశలో దెబ్బతిన్న ఇళ్ల జాబితాలు సిద్ధమయ్యాయి. రెవెన్యూ డివిజన్ల వారీ గా నివేదికలను అధికారులు గురువారం ఖరారు చేశా రు. వారం రోజుల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 5342 ఇళ్లు దెబ్బతిన్నట్లు లెక్క తేల్చారు. అయిదు రోజులకు మించి 923 కుటుంబాలు, అయిదు రోజుల కంటే తక్కువగా 11,463 కుటుంబాలు నీట మునిగినట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ జాబితాలను తహశీల్దార్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గురువారం ప్రదర్శించారు. బాధితులకు పంపిణీకి అవసరమైన బియ్యం, కిరోసిన్ జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ శుక్రవారం కేటాయించనున్నారు. గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు భారీ వర్షాలు కారణంగా జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు పొంగి ప్రవహించి 364 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
ఇందులో 67 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వర్షాలకు ఇళ్లు నేలకూలడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నష్టం అంచనాలను తయారు చేసి వెంటనే పంపాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఇళ్లను కోల్పోయిన వారికి ముందుగా సాయానికి షరతులతో కూడిన పరిహారాన్ని ప్రకటించింది. పంట నష్టం అంచనాకు సమయం పట్టే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేసి నీట మునిగిన, దెబ్బతిన్న ఇళ్ల జాబితాలను సిద్ధం చేశారు.
దీని ప్రకారం విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో 62 ఇళ్లు పూర్తిగాను, 65 తీవ్రంగాను, 1102 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తేల్చారు. ఈ డివిజన్‌లో 83 కుటుంబాలు అయిదు రోజులకు మించి, 267 కుటుంబాలు అయిదు రోజులలోపు వరద నీటిలో ఉన్నట్లు నిర్ధారించారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో 148 ఇళ్లు పూర్తిగాను, తీవ్రంగాను, 1184 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఇక్కడ 5 రోజులు దాటి 840 కుటుంబాలు, 5 రోజులలోపు 4233 కుటుంబాలు నీట ఉన్నట్లు తేల్చారు.
నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లో 29 ఇళ్లు పూర్తిగాను, 39 తీవ్రంగాను, 828 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నగా ఇక్కడ 6963 కుటుంబాలు 5 రోజుల లోపు నీట మునిగినట్లు గుర్తించారు. అదే విధంగా పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇళ్లు నీట మునగలేదని, అయితే 47 ఇళ్లు పూర్తిగాను, తీవ్రంగాను, 1838 ఇళ్లు పాక్షికంగా పాడైనట్లు అధికారులు తేల్చారు.
ఆదివారంలోగా పంపిణీ
వరద బాధితులకు ఆదివారంలోగా నగదు, బియ్యం, కిరోసిన్‌లను పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితుల జాబితాలను గ్రామ పంచాయతీ, మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. రెండు రోజుల్లో వచ్చిన అభ్యంతరాల మేరకు తుది జాబితాను తయారు చేసి బాధితులకు పరిహారం అందించనున్నారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన ఒక్కో కుటుంబానికి దుస్తులు కొనుగోలుకు రూ.2500, ఇంటి, వంట సామాగ్రి కొనుగోలుకు రూ.2500 చొప్పున నగదును ఇవ్వనున్నారు. అలాగే అయిదు రోజులు కంటే ఎక్కువగా వరద నీటిలో మునిగిన ఒక్కో కుటుంబానికి 20 కిలోల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్‌ను, 5 కంటే తక్కువ రోజులు నీటిలో ఉన్న ఇళ్లకు, అదేవిధంగా పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం, 2 లీటర్లు కిరోసిన్‌ను అందించనున్నారు.