తాగునీటి సమస్య లేకుండా చూడండి
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్యేలతోపాటు కడప మేయర్ కోరారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన నిధుల గురించి మంగళవారం ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాములుతోపాటు కడప మేయర్ సురేష్‌బాబులు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, సీఈఓ మాల్యాద్రితో చర్చించారు.
ఈ చర్చల్లో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పర్వతరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ రమేష్‌లు కూడా ఉన్నారు. జిల్లాలో చిం తకొమ్మదిన్నె, సుండుపల్లె, రాయచోటి, రామాపురం, పెండ్లిమర్రి, బద్వేలు, కోడూరు, లక్కిరెడ్డిపల్లెలతోపాటు ఇంకా చాలా మండలాల్లో తీవ్ర మంచినీటి సమస్య ఉందని వారు వివరించారు. ఈ గ్రామాలలో తక్షణం మంచి నీటి సమస్యను తీర్చాలంటే నియోజకవర్గానికి రూ. 30 లక్షల చొప్పున నిధులు కావాలని వారు జెడ్పీ చెర్మైన్ గూడూరు రవి, సీఈఓ మాల్యాద్రిలను కోరారు.
దీనికి స్పం దించిన వారు నిధులు రాగానే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వీటితోపాటు ఇంకా ఏయే మండలాల్లో మంచినీటి సమస్య ఉందని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పర్వతరెడ్డితో ఎమ్మెల్యేలు చర్చించారు. గాలివీడు మండలంలో రూ. 5 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన మంచినీటి స్కీం పనులు ఎలా జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఈఈని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత స్కీం పనులను మార్చిలోపు పూర్తిచేయాలని కోరారు.