దారుణహత్యకు గురైన సునీత(ఫైల్)
కిరాతకం, రాక్షసత్వం, దారుణాతి దారుణం, ఘోరాతి ఘోరం... మనిషి సాగిస్తున్న మారణహోమానికి ఇలాంటి పదాలు కూడా సరిపోవు. క్రూర మృగాలు తమ మనుగడ కోసం సాటి జీవులను వేటాడతాయి. బుద్ధిజీవి మనిషి మాత్రం పగ సాధించడం కోసం తోటి మనిషి ప్రాణాలు తోడేస్తున్నాడు. వర్తమాన సమాజంలో జరుగుతున్న దారుణాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఓ మహిళ హత్యోదంతం ఇందుకు సజీవ సాక్ష్యం.
అంబర్‌పేట్‌కు చెందిన సునీత అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వెలుగుచూసిన వాస్తవాలు ఒల్లుజలదరించేలా ఉన్నాయి. జూన్ 16న అదృశ్యమైన ఆమెను చంపించింది ఓ మహిళే అన్న నిజం అందరినీ నిశ్చేష్టపరిచింది. సునీత భర్త కృష్ణపై పగ సాధించేందుకు ఆయన వ్యాపార మాజీ భాగస్వామి విజయారెడ్డి ఈ కిరాతానికి పూనుకుంది. తన స్నేహితుడు జగన్నాథనాయుడు సాయంతో సునీతను అంతమొందించింది. జగన్నాథనాయుడు సునీతను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మూసీలో పడేశాడని తెలియడంతో అంతా నివ్వెరపోయారు.
అయితే కృష్ణ, సునీతల గారాలపట్టి శ్రావణి(10)ని అపహరించి, హతమార్చాలన్న కర్కశుల వ్యూహం ఫలించకపోవడంతో ఆ చిన్నారి బతికిపోయింది. చివరకు ఆమె తల్లిని బలితీసుకున్నారు. మనుషుల్లో క్షీణిస్తున్న మానవతా విలువలకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. ఆధునిక మానవుడు ఇంతటి దారుణాలకు తెగ బడడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. పగ సాధించడం కోసం ఇంత రాక్షసంగా మారాలా?