అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
విజయనగరం క్రైం: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందింది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన మాధవి(24)ని పుత్సలవీధి జగన్నాథపురానికి చెందిన యర్రా శ్రీనివాసరావుకు ఇచ్చి 2009లో వివాహం చేశారు. వీరికి రత్నకాంత్ అనే మూడేళ్ల బాలుడు ఉన్నాడు. మాధవి ఉరఫ్ దేవి భర్త శ్రీనివాసరావు పట్టణంలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో వస్తు సామగ్రి అమ్మేవాడు. బాలాజీనగర్ ఉంటున్న భావ సూర్యప్రకాష్ ఇంట్లో సామగ్రిని సైతం అమ్మేశాడు.
వైఎస్‌ఆర్ నగర్‌లో నివాసముంటున్న శ్రీనివాసరావు పెద్ద చెల్లెలు నూతన గృహ ప్రవేశం మూడు రోజుల కిందట జరిగింది. అక్కడికి మాధవి అత్త రాఘవమ్మ వెళ్లారు. శనివారం ఉదయం భర్త శ్రీనివాసరావు హోటల్‌కు పని నిమిత్తం వెళ్లాడు. సాయంత్రం నాలుగున్నర సమయానికి ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు కొట్టగా ఆ శబ్ధానికి మూడేళ్ల బాలుడు రత్నాకాంత్ గట్టిగా అరిచాడు. శ్రీనివాసరావు వెంటనే తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లేసరికి మాధవి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరిపోసుకుని ఉంది. ఆమె పక్కనే బాబు కూడా ఉన్నాడు.
శ్రీనివాసరావు చుట్టుపక్కల మహిళలకు, బంధువులకు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, ఇన్‌చార్జి సీఐ కె.రామారావు, రెండో పట్టణ ఎస్‌ఐ శ్రీధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మాధవి మెడకు గాటు ఉండటంతో ఆత్మహత్య.. లేదా హత్యా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. మాధవి గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. మృతురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మాధవి మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి పార్వతి, అన్న సూర్యప్రకాష్ విలేకరులతో పేర్కొన్నారు.