కదిరి (అనంతపురం) : ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లిన నిండు గర్భిణికి ఖాళీ ఆస్పత్రి దర్శనం ఇవ్వడంతో.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడానికి ఆటోను ఆశ్రయించింది. ఆటోలో వెళ్తున్న సమయంలో నొప్పులు ఎక్కువవడంతో .. ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దిల్షాద్(23) అనే మహిళ నిండు గర్భిణి కావడంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. కానీ అక్కడ సిబ్బంది లేకపోవడంతో.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. అదే సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఆటోలోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు.