బాలికకు బిస్కెట్లు ఇస్తున్న అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి
సాక్షి, గుంటూరు : మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ. ప్రియుడి కోసం అభంశుభం ఎరుగని కుమార్తెను మాయపుచ్చి.. ఓ అపరిచిత మహిళకు అప్పగించి పలాయనం చిత్తగించింది. తల్లిలా అక్కున చేర్చుకున్న ఆ మహిళ కొంతకాలానికి అనారోగ్యం బారిన పడడంతో..ఆ చిన్నారిని ఆదుకోవాలని కోరుతూ పోలీసుల చెంతకు చేర్చింది. దీంతో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి బాలికకు ధైర్యం చెప్పి, ఓదార్చి మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బందికి అప్పగించిన ఘటన అందరి మనస్సులను కట్టిపడేసింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఓ మహిళ భర్త మరణించడంతో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ గుంటూరులోని పట్టాభిపురంలో ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా జీవనం సాగిస్తోంది. అక్కడ పనిమనిషితో స్నేహంగా మెలిగింది. కొంత కాలానికి తాము అత్యవసర పనిమీద హైదరాబాదు వెళ్తున్నామని, పాపను చూస్తుండమని చెప్పి కుమార్తెను పనిమనిషికి అప్పగించి వెళ్లిపోయింది. (పెళ్లి పేరుతో శారీరకంగా ఒక్కటై.. ఆపై..)
అనంతరం వారి ఫోన్‌లు పనిచేయలేదు. వారి ఆచూకీ తెలియలేదు. మానవత్వంతో ఆ మహిళ తన పిల్లలతో పాటే సొంత కూతురిలా చూసుకుంది. అయితే కొద్దిరోజులుగా ఆ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తన పిల్లల్ని అమ్మమ్మ ఇంటికి పంపించింది. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉన్న ఆమె తాను చనిపోతే ఈ బాలిక గతేమిటి అని ఆలోచించి గురువారం పట్టాభిపురం పోలీసుల చెంతకు ఆ చిన్నారిని చేర్చింది. విషయం తెలిసిన అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి బాలికను తన కార్యాలయానికి పిలిపించుకుని అల్పాహారమిచ్చి ధైర్యం చెప్పారు. చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సుగుణాల రాణి, అర్బన్ స్పెషల్ ఉవెనైల్ పోలీస్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ డి.గంగాధరం, డబ్ల్యూఎస్‌లో బేబిరాణి, ఎలిజిబెత్ రాణి పర్యవేక్షణలో బాలికను సంరక్షణాలయానికి పంపించారు. (డ్యూటీకి అని చెప్పి మొదటి భార్య ఇంటికి..)
Comments
Please login to add a commentAdd a comment