ప్రేమ పేరుతో వలవేస్తున్న 'ఖాకీ'చకులు | Cops Cheating Young Girls In The Name Of Love | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వలవేస్తున్న 'ఖాకీ'చకులు

Published Wed, Jan 29 2020 7:51 AM | Last Updated on Wed, Jan 29 2020 8:19 AM

Cops Cheating Young Girls In The Name Of Love - sakshi - Sakshi

నరసరావుపేట సబ్‌ డివిజన్‌లో ఓ ఎస్‌ఐకి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. వివాహితుడైన సదరు ఎస్‌ఐ ఆమెతో చాటింగ్‌ ప్రారంభించాడు. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని ఎస్‌ఐ వివాహేతర సంబంధం కొనసాగించాడు. కొద్ది రోజుల తర్వాత  ఆమెను దూరం పెట్టాడు. దీంతో ఆ యువతి రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావుకు ఫిర్యాదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐని వీఆర్‌కు బదిలీ చేశారు.  
 
మెట్టినింట వేధింపులు ఎదురైతే.. కట్టుకున్న వాడు కాదు పొమ్మంటే.. ప్రేమించిన వ్యక్తి నమ్మించి నట్టేట ముంచితే.. పక్కింటి పోకిరీ వేధింపులకు పాల్పడుతుంటే.. అబలలకు రక్షణ కవచమై నిలిచేది పోలీస్‌. ఇలాంటి రక్షణ వ్యవస్థలో ఉన్న కొందరు ఖాకీలు కట్టుతప్పుతున్నారు. మాయమాటలతో మహిళలను వంచిస్తున్నారు. వరకట్న పిశాచులై   వేధింపులకు పాల్పడుతున్నారు. జిల్లాలో కొందరు పోలీసులపై మహిళా బాధితుల ఫిర్యాదులు రోజురోజుకూ అధికమవుతున్నాయి.  

సాక్షి, గుంటూరు: కామాంధుల నుంచి ఆడబిడ్డలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే వారిపాలిట భక్షకులుగా మారుతున్నారు. కొందరు ప్రేమ పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో పోలీస్‌ సిబ్బందిపై ఈ తరహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
అదనపు కట్నం కోసం.. 
గురజాల సబ్‌ డివిజన్‌లో ఎస్‌ఐ చెంగా నాగార్జున 2017లో ప్రేమించి ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం విధుల నిమిత్తం పుట్టింటికి పంపించాడు. నెలలు గడుస్తున్నా భర్త రాలేదు. దీంతో ఆమె అచ్చంపేటలో విధులు నిర్వహిస్తున్న నాగార్జున వద్దకు  వెళ్లింది. అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళతానని ఎస్‌ఐ చెప్పాడు. దీంతో భర్త ఇంటి ఇంటి ముందు అప్పట్లో యువతి నిరసనకు దిగింది. పోలీసులు అధికారులు ఆమెకు నచ్చజెప్పి పంపారు. నాగార్జున భార్యకు విడాకుల నోటీసులిచ్చాడు. దీంతో నెల్లూరు జిల్లా పోలీసులకు ఎస్‌ఐపై యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన పలుకుబడితో కేసు నీరుగారుస్తున్నారని యువతి రూరల్‌ ఎస్పీని ఆశ్రయించింది.  

ప్రేమించి పెళ్లి చేసుకుని..  
గుంటూరు రూరల్‌ జిల్లాలో ప నిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ తనను ప్రేమ పేరుతో మోసగించాడని యువతి రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎవరికీ తెలియకుండా కృష్ణా జిల్లా మోపిదేవిలోని దేవాలయంలో పెళ్లి చేసుకుని కొద్ది రోజులు కాపురం చేశాక వదిలేశాడని ఆరోపించింది.   న్యాయం చేయాలని పోలీస్‌ స్టేషన్‌కు వెళితే ఎస్‌ఐ లోబర్చుకున్నాడని, తన తల్లిని కానిస్టేబుల్‌ లాడ్జికి రమ్మన్నాడని ఓ యువతి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పోలీస్‌ సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై గుంటూరు ఈస్ట్‌ డీఎస్పీ సుప్రజను విచారణ అధికారిగా అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ నియమించినట్టు తెలిసింది. ఆపదలో ఉన్న మహిళలకు పోలీస్‌ శాఖ అండగా ఉంటుందని ఉన్నతాధికారులు, ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం పెంచేలా కార్యక్రమాలు చేపడుతుంటే.. కొందరు ఖాకీలు కట్టుతప్పుతున్నారు. పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారు.   

విచారణ చేస్తున్నాం
పోలీస్‌ సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై చర్యలు చేపట్టాం. విచారణలో సిబ్బంది తప్పు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీఆర్‌కు పంపాం. పోలీస్‌ సిబ్బంది, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్‌ శాఖలో పని చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.  
– సీహెచ్‌ విజయారావు, రూరల్‌ ఎస్పీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement