ఫోన్ ప్రేమ వికటించింది! | women cheated by her lover | Sakshi
Sakshi News home page

ఫోన్ ప్రేమ వికటించింది!

Published Fri, May 8 2015 4:43 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

ఫోన్ ప్రేమ వికటించింది! - Sakshi

ఫోన్ ప్రేమ వికటించింది!

- సహజీవనం చేసి,పరారైన ప్రేమికుడు
- తమ ఇంటికి వద్దన్న బాధితురాలి కుటుంబసభ్యులు
- ఐసీడీఎస్ చొరవతో పోలీసులకు ఫిర్యాదు
పెద్దపంజాణి:
ఫోన్ ప్రేమ వికటించింది. దీంతో బాధితురాలు ఐసీడీఎస్ పోలీసులను ఆశ్రయించింది. ఫోన్‌లో సంభాషణలతోనే రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకుని పలమనేరుకు చేరుకున్నారు. రహస్యంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, సహజీవనం చేశారు. అతడికి ఆ అమ్మాయిపై మోజు తీరిపోగానే పారిపోయాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకెళితే... పెద్దపంజాణి మండలంలోని పోలేపల్లె గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి ఆరో తరగతి వరకూ చదువుకుంది.

ఆరు నెలల క్రితం ఆమె ఫోన్‌కు ఒక మిస్ కాల్ వచ్చింది. ఆ నంబర్‌కు ఆమె తిరిగి ఫోన్ చేసింది. అరగొండకు సమీపంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 25 రోజుల క్రితం ఒకరినొకరు కలుసుకుని పెళ్లి చేసుకోవాలని ఇళ్ల నుంచి రహస్యంగా పారిపోయి వచ్చి, పలమనేరు లో కలుసుకున్నారు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 20 రోజుల పాటు ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేశారు. ఐదు రోజుల క్రితం ప్రేమ్‌కుమార్ విజయవాడలో ఉద్యోగం కోసం వెళుతున్నానని, ఈనెల 15వ తేదీన తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి, జారుకున్నాడు.

అద్దె డబ్బులు ఇవ్వలేదని ఇంటి యజమాని ఇల్లును ఖాళీ చేయమన్నాడు. దీంతో ఆ యువతి ప్రేమ్‌కుమార్‌కు ఫోన్ చేయగా నీవు పుట్టింటికి వెళ్లాలని, తాను విజయవాడ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని మాటల్లో నిజం లేదని గుర్తించిన ఆ యువతి బుధవారం రాత్రి పలమనేరు పోలీసులను ఆశ్రయించిం ది. అయితే పెద్దపంజాణి మండలానికి సంబంధించిన కేసు అయినందున అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించగా పెద్దపంజాణికి చేరుకుంది. ఈ విషయాన్ని పెద్దపంజాణి పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

బాధితురాలి కుటుంబ సభ్యులను సంప్రదించగా తమను కాదని వెళ్లిన అమ్మాయి తమకు అక్కర్లేదని, తమ ఇంటికి రానివ్వమ్మని తెగేసి చెప్పేశారు. దీంతో చేసేది లేక ఐసీడీఎస్ అధికారులు మదనపల్లెలోని చైల్డ్ హోంలో ఉంచి, గురువారం ఉదయం అమ్మాయి ని పోలేపల్లెకు తీసుకెళ్లారు. ఆ యువతి కుటుంబ సభ్యులను పలకరించగా ముందు రోజు చెప్పిన మాటే మళ్లీ చె ప్పారు. చేసేది లేక పెద్దపంజాణి పోలీస్ స్టేషన్‌లో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు రెండు రోజులు గడువు కోరడంతో బాధితురాలిని తిరిగి మదనపల్లెలోని చైల్డ్ హోంకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్, ఏసీడీపీవో ఎల్లమ్మ,  సూపర్‌వైజర్ సులోచన  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement