మహిళా కండక్టర్ ఆత్మహత్య
గుంటూరు ఈస్ట్ :
నమ్మించి మోసగించడమే కాకుండా వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందని ఓ మహిళా కండెక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో వినయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు మండలం శేకూరుకు చెందిన జొన్న శివమ్మ కుమార్తె వెంకటేశ్వరమ్మకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.
తీవ్ర అనారోగ్యంతో ఉండి, ఆ విషయం చెప్పలేదని తెలిసి పెళ్లయిన మూడు నెలలకే ఆమె భర్త నుంచి విడిపోయి కొంతకాలానికి విడాకులు తీసుకుంది. తెనాలి ఆర్టీసీ డిపోలో ఐదేళ్లుగా కండక్టర్ ఉద్యోగం చేస్తున్న ఆమె తన తల్లితో కలిసి ఐతానగర్‌లో అద్దెఇంట్లో నివాసం ఉంటోంది. అదేప్రాంతానికి చెందిన పెయింటర్ సీహెచ్ రవి తనకు వివాహం కాలేదని నమ్మించి వెంకటేశ్వరమ్మతో సంవత్సరం నుంచి స్నేహం చేసుకున్నాడు. మూడు నెలల క్రితం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తీసుకువెళ్లాడు.
ఈ విషయం తెలిసి రవి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్దల సమక్షంలో రవి, వెంకటేశ్వరమ్మ విడిపోయేవిధంగా తీర్మానం చేశారు. అయినా నెలరోజులుగా ఆమె వెంటపడుతూ తామిద్దరూ స్నేహంగా ఉన్నప్పడు తీసిన ఫొటోలను అందరికీ చూపిస్తానని బెదిరించసాగాడు. ఈ విషయమై బాధితురాలు తెనాలి రెండోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. 15 రోజుల క్రితం తన నివాసాన్ని లాలాపేట సిద్ధాబత్తుని వారివీధిలోకి మార్చింది. డ్యూటీ నిమిత్తం తెనాలి వెళ్లిన ఆమెను శనివారం ఉదయం బస్టాండ్ సమీపంలో కలిసి మళ్లీ బెదిరించాడు. విషయం తెలిసి ఆమె సోదరుడు రాజేష్ అక్కడకు వెళ్లగా గొడవ జరిగింది.
రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు రవిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేశ్వరమ్మ రాత్రికి గుంటూరు చేరుకొంది. ఆదివారం మధ్యాహ్నం తన తల్లి ఇంటిలో లేని సమయంలో వెంకటేశ్వరమ్మ ఇంటి దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌హెచ్‌వో వినయ్‌కుమార్, ఎస్‌ఐ మురళీకృష్ణ సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రాజేష్ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు