మక్కువ : మండలంలోని వెంకట భైరిపురం గ్రామానికి చెందిన వెలమల పార్వతి (40) అనే మహిళ శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. స్థానిక వీఆర్వో శ్రీనివాసరావు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... పార్వతి శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి గ్రామ సమీపంలో ఉన్న గుడేవలస కొండకు కట్టెల కోసం వెళ్లింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈదురుగాలు, మెరుపులు, ఉరుములు రావడంతో ఆమె కొండ సమీపంలోని పాక వద్దకు వెళ్లింది. అందులోనే చెల్లూరు రవిప్రసాద్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఇంతలో వర్షం పడడంతో పాటు పెద్ద శబ్దం వచ్చి పాకపై పిడుగు పడటంతో పార్వతీ అక్కడికక్కడే మృతి చెందగా, రవి ప్రసాద్ గాయాలపాలయ్యాడు. రవిప్రసాద్‌ను మక్కువ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన పార్వతికి భర్త తవిటినాయుడు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పార్వతి పిడుగు పాటుకు మృతి చెందడంతో వెంకటభైరిపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.