♦ సీఐ అసభ్యకరంగా మాట్లాడి, బూటుకాలితో తన్నారు
♦ సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
♦ ఎస్పీ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ధర్నా
గుంటూరు క్రైం : మహిళా సంఘాల సభ్యులతో అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించిన గుంటూరు కొత్తపేట పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సీఐ వెంకన్న చౌదరిని విధుల నుంచి తొలగించి, ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని కోరుతూ పలు ప్రజా సంఘాల నాయకులు, మహిళలు ఎస్పీ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. మహిళ అయి వుండీ అసభ్య పదజాలాన్ని వాడిన మహిళా హెడ్ కానిస్టేబుల్ భాగ్యలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు మాట్లాడుతూ సోమవారం మద్యం దుకాణాల లెసైన్స్‌లు కేటాయించే విధానాన్ని నిరసిస్తూ గుంటూరులో ప్రదర్శన చేస్తున్న మహిళలపై కొత్తపేట సీఐ వ్యవహరించిన తీరు అనుచితంగా ఉందని, దీనిపై ఉన్నతాధికారులు విచారించి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడుతూ తమను సీఐ బూటుకాలుతో తన్ని, అసభ్యకరంగా మాట్లాడుతూ, రక్తం కారేలా కొట్టారన్నారు.
సామాజిక న్యాయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.కోటేశ్వరరావు(వైకే) మాట్లాడుతూ సీఐ వెంకన్న చౌదరిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళతామని తెలిపారు. అనంతరం అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పి.ప్రసాద్, ఎస్.సురేష్, భావన్నారాయణ, జంగాల అజయ్‌కుమార్, కె.వినయ్‌కుమార్, బి.కొండారెడ్డి, మహిళా సంఘాల నాయకులు శీలం ఏసమ్మ, ఎన్,సాంబ్రాజ్యం, దేవి,అరుణ,ఐద్వా సంఘం మహిళలు పాల్గొన్నారు.
కొత్తపేట సీఐపై మహిళాగ్రహం
Published Tue, Jun 30 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM
Advertisement