సీఎంపై ధ్వజమెత్తిన మహిళలు
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలకు ముందు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికి అధికారం చేపట్టిన చంద్రబాబు ఆడోళ్లను మోసం చేశారని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. తమను మోసం చేసి బాగుపడ్డోళ్లు లేరని శాపనార్థాలు పెట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఉద్దేహాళ్‌లో శనివారం సాయంత్రం ప్రతిపక్ష నేత జగన్ డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులతో ముఖాముఖి జరిపి వారి వేదనలను తెలుసుకున్నారు.అవి ఇలా...
పది పైసలు సాయం రాలే...
‘‘సారూ...నా పేరు గుణావతి. డ్వాక్రా గ్రూపు ద్వారా రూ.10 వేలు రుణం తీసుకుంటి. చంద్రబాబు చెప్పినాడని అప్పు కట్టకపోతి. ఇప్పుడేమో వడ్డీలకు వడ్డీలు కలిపి కట్టమంటిరి. ఈ పొద్దు ఆ పొద్దు నోటీసుల పంపుతుంట్రి. రూ.3 పైనే వడ్డీ అయినాది. నా తాన చిల్లిగవ్వ లేదు. అప్పు కట్టే పరిస్థితి లేకపోయె. పది పైసల సాయం కూడా రాలే. ఎట్టా బతకాలో అర్థం కావడం లేదు.’’
- గుణావతి (70 ఏళ్లు), హరే సముద్రం
రుణమాఫీ గురించి బాబునే అడగమంటిరి
‘‘ఎంతో ఆశ పడి ఓటేస్తే నిలువునా ముంచేసినాడు. పాస్‌బుక్‌తో పనుండి బ్యాంకుకు వెళితే అప్పులన్నీ కట్టాకే రావాలంటున్నారు. రుణమాఫీ గురించి అడిగితే... హైదరాబాదెళ్లి చంద్రబాబునే అడగమంటిరి.’’ - లోకేష్, కళహొళ
చంద్రబాబుది నిండా మోసం...
‘‘చంద్రబాబుది నిండా మోసమయ్యా. అప్పులు తీరక మా గ్రామం గొల్లు మంటుంది. బాబు నిజంగానే సముద్రంలో ముంచేసినాడు.’’
- పార్వతమ్మ (60 సంవత్సరాలు),కురివెళ్లి
ఆడోళ్లను మోసం చేసి బాగుపడ్డోళ్లు లేరు
Published Sun, May 17 2015 2:01 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement