సమైక్యాంధ్ర కోసం గర్జించిన మహిళా లోకం
Published Sun, Sep 15 2013 1:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
గుంటూరు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర ఉద్యమం 46వ రోజు శనివారం హోరెత్తింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మహిళలు, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మానవహారం, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యార్థినులు పెద్ద సంఖ్యలో రిలేదీక్షల్లో కూర్చున్నారు. మండల విద్యాశాఖాధికారులు చెప్పులు కుట్టి విభజన నిర్ణయానికి నిరసన తెలిపారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా నిరసన తెలియజేయగా, వికలాంగులు ప్రదర్శనలు నిర్వహించి సమైక్యాంధ్రను కాంక్షిస్తూ నినాదాలు చేశారు. మాచర్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మానవహారం, రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్ని రోడ్డుపైనే ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రకు కట్టుబడి మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తుందని తెలిపారు.
విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. బాపట్లలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణ రావులు జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ట్రాక్టర్ల యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనను ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ప్రారంభించారు. నరసరావుపేట పట్టణంలో మహిళాగర్జన పేరుతో కృష్ణవేణి ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థినులు భారీ ప్రదర్శన నిర్వహించారు. భావన వికాస్ వాసవీ కళాశాల ఆధ్వర్యంలో రెండువేల మంది విద్యార్థినులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను రాష్ట్రమంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పొన్నూరు పట్టణంలో ఐసీడిఎస్, డాక్వా గ్రూపు మహిళలు భారీగా ఐలాండ్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేపట్టారు. చేబ్రోలులో రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది.
మహిళా గర్జన...
మంగళగిరి పట్టణంలో మహిళా గర్జన నిర్వహించారు. ఎంపీడీఓ బి.శ్యామలాదేవి, సీడీపీఓ కె.ప్రమీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రేపల్లె పట్టణంలో కూడా మహిళా గర్జన నిర్వహించారు. రోడ్డుపై రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. వినుకొండ పట్టణంలో మండల విద్యాశాఖాధికారులు చెప్పులుకుట్టి నిరసన తెలిపారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వేటపాలెం గ్రామస్తులు స్వచ్ఛందంగా నిరసన తెలిపారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. పెదకూరపాడులో వికలాంగులు ప్రదర్శన నిర్వహించారు. క్రిష్టియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన చేపట్టారు.
గుంటూరు నగరంలో...
పాలిటెక్నిక్, జూనియర్ కళాశాల అధ్యాపకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. హనుమాన్ ఆదర్శ సేవా సమితి ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి సేవా సమితి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థినులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement