గర్జించిన మహిళలు
Published Sun, Sep 15 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :సిక్కోలు మహిళలు గర్జించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డెక్కి నినదించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన మహిళా గర్జన విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో గృహిణులు, డ్వాకా మహిళలు, ఐకే పీ, ఐసీడీఎస్‌కు చెందిన మహిళా ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువతులు భాగస్వాములయ్యారు. గర్జనలో పాల్గొనేందుకు శ్రీకాకుళం ఎన్జీవో హోం వద్దకు ఉదయం తొమ్మి ది గంటలకే భారీగా మహిళలు చేరుకున్నారు. అక్కడ నుంచి వైఎస్‌ఆర్ కూడలి వరకు సమైక్యాంధ్రకు మద్దంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. అక్కడ మానవ హారం చేపట్టారు. డప్పులు వాయిస్తూ, నెత్తిపై కడవలతో నీటిని పట్టుకొని, తెలుగుతల్లి వేషధారణలతో నిరసన తెలిపారు.
కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీసీ జిల్లా కన్వీనర్ ధర్మన పద్మప్రియాదాస్, పార్టీ నాయకులు బొడ్డేపల్లి మాధురి, వరుదు కల్యాణి, వైవీ సూర్యనరాయణ, ఎన్ని ధనుంజయ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గీతా శ్రీకాంత్, ఎన్జీవో నాయకులు హనుమంతు సాయిరాం, చౌదరి పురుషోత్తం, ఏఆర్‌కే దాస్, హరికృష్ణ, విద్య సంస్థల ప్రతినిధు లు జామి భీమ శంకర్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్‌లో వంటా వార్పు కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఆర్ ఎంఓ ఎల్.ప్రసన్న కుమార్, ఏఆర్‌ఎంఓ బీసీహెచ్ అప్పలనాయుడు భాగస్వాములయ్యారు. మహిళా ఉద్యోగులు రిమ్స్ ఆవరణను తుడిచి నిరసన వ్యక్తం చేశారు.
రెవెన్యూ, గృహనిర్మాణ, పశుసంవర్థక, ఆర్‌అండ్‌బీ, పురుపాలక, ఆర్టీసీ ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి. వైఎస్‌ఆర్ కూడలి వద్ద ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు, కోర్టువద్ద న్యాయవాదులు దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షాశిబిరాన్ని ఆ సంస్థ చైర్మన్ సందర్శించి సంఘీభావం తెలిపారు. 15న కలెక్టరేట్, జెడ్పీ వద్ద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఉద్యోగుల సహకరించాలని కోరారు. 20వ తేదీన తలపెట్టి లక్ష గళార్చనకు ఉద్యోగులు వారి స్నేహితులను, బంధువులను తీసుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరంలో టి.వైకుంఠరావు, ఎస్.వి.రమణమూర్తి పాల్గొన్నారు.
పాలకొండలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతృత్వంలో 150 అడుగుల జాతీయ జెండాతో మహార్యాలీ చేపట్టారు. వేలాది మహిళలతో పాలకొండలో మహిళా మార్చ్ జరిగింది. ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక వద్ద నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌లో సమైక్యాంధ్రకు శతశాతం ఓటింగ్ నమోదైంది. చినమంగళాపురం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని 50 మంది ఉపాధ్యాయులు రిలే నిరాహారదీలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి శిబిరం వద్ద సీతంపేట మండలం చినబగ్గ, పూతికవలస, కొత్తూరు మండలం లబ్బ స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలోని ఉపాధ్యాయులు దాదాపు 70 మంది నిరాహారదీక్ష చేపట్టారు. విద్యార్థి జేఏసీ నేతృత్వంలో ఇంజినీరింగ్ విద్యార్థులు సోనియా, మన్మోహన్, సీమాంధ్ర కేంద్రమంత్రుల మాస్క్‌లు పెట్టు.. వ్యంగ్య ప్రదర్శనలతో నిరసన తెలిపారు. సీతంపేటలో మండల మహిళా సమాఖ్య నుంచి పీఎంఆర్‌సీ వరకు మహిళలు ర్యాలీ చేసి రహదారిపైనే సమావేశం ఏర్పాటు చేశారు. వీరఘట్టంలో ఐసీడీఎస్ ఐధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
ఆమదాలవలసలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రహదారిని కంపలతో తుడుస్తూ నిరసన తెలిపారు. ఐకేపీ, ఐసీడీఎస్‌ల ఆధ్వర్యంలో అధికసంఖ్యలో మహిళలు భారీ ర్యాలీ చేశారు. లక్ష్మీనగర్ జంక్షన్ వద్ద మానవహారం జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమంపై అవగాహక కల్పించేందుకు పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సరుబుజ్జిలి జంక్షన్‌లో సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. 48 గంటలుగా సరుబుజ్జలిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయలుకు ఎంపీడీఓ కె.వసంతరావు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. బూర్జ జంక్షన్‌లో మహిళా సంఘాలు మానవహారం చేపట్టారు.నరసన్నపేటలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిం చారు. రోడ్డుపై ైబె ఠాయించి నినాదాలు చేశారు. సమైక్య గీతాలు ఆలపించారు. జలుమూరు, పోలాకి, సారవకోట మండలాల్లో నిరసన కార్యక్రమాలను సమైక్యవాదులు చేపట్టారు. జలుమూరు మండలం కరవంజి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
పలాస-కాశీబుగ్గ సూర్యతేజ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి హాజరైన బీఆర్‌ఏయూ వీసీ లజపతిరాయ్‌కు సమైక్య సెగ తగిలింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేయించారు. పలాస జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. పొందర కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఉద్యోగుల సంఘాలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. టీడీపీ, ఉపాధ్యాయ జేఏసీ, ప్రెస్‌క్లబ్ సభ్యుల దీక్షలు కొనసాగాయి. గురుదాసుపురం, మామిడిమెట్టు గ్రామాల్లో ఉపాధ్యాయులు ర్యాలీ రాష్ట్రాన్ని విభజించవద్దని నినాదాఉలు చేశారు. సున్నాడ గ్రామానికి చెందిన జీడి కార్మికులు రోడ్డుపై జీడిపిక్కలు కొడుతూ నిరసన తెలిపారు. మందసలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమైక్య పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని వైఎస్‌ఆర్ సీపీ పలాస సమన్వయకర్త వజ్జ బాబూరావు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాల్లో వెఎస్సార్ సీపీ ఆధ్వర్యంలోని రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అధికంగా మహిళలు పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కవిటి మండలంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. కంచిలి మండలంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఎచ్చెర్లలోని పాలటెక్నిక్ కళాశాల ఆధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కుశాలపురం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పలువురు అయ్యవార్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement