- ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళల ఘర్షణ
- ఆ ఇంటిని వదిలేసిన ఎన్యూమరేటర్
- పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ
పరకాల : సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్‌తో ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన సంఘటన పట్టణంలోని వెలమవాడలో మంగళవారం సాయంత్రం జరిగింది. పట్టణంలోని వెలమవాడకు చెందిన దగ్గు నర్సింగరావు ఎంబీబీఎస్ వైద్యుడు. పరకాలలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సునీతతో 1999లో వివాహమైంది. కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత విభేదాలు వచ్చాయి.
అదే సమయంలో నర్సింగరావు శ్రీశైలం సమీపంలోని సుండిపేటకు చెందిన వాణి(నూర్జహాన్)ను 2005లో మరో పెళ్లి చేసుకున్నాడు. అతడు అనారోగ్యంతో 2008లో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆయన భార్యలు సునీత, వాణి మధ్య తగాదా వచ్చి కోర్టుకెక్కారు. కోర్టులో కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నట్లు సమాచారం అందడతో వాణి సోమవారం రాత్రి పట్టణానికి చేరుకుంది. సర్వే కోసం వచ్చే సిబ్బంది కోసం మంగళవారం ఎదురుచూస్తున్నారు.
ఆ కాలనీలో 9-49 ఇంటినంబర్‌లో ఉంటున్న వారివద్దకు ఎన్యూమరేటర్ కేదారి వచ్చారు. ఆయన సమక్షంలోనే సునీత, వాణి.. ఆ ఇంటిపై నా పేరు రాయమంటే.. నా పేరు రాయమని ఘర్షణకు దిగారు. గంటల తరబడి ఇద్దరు పేరు కోసం పట్టుబట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారిద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సునీత, వాణికి సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ ఇచ్చి గొడవ పెట్టుకోవడం సరికాదని సూచించారు. కేసు విచారణలో ఉండగా మీరిలా ప్రవర్తించడం పద్ధతి కాదని, మరోసారి గొడవ జరిగితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఎన్యూమరేటర్ ఆ ఇంటిని మినహాయించి సర్వే కొనసాగించాడు.