లోకేష్ ఛాంబర్ ఎదుట మహిళ ఆవేదన
- 8 నెలలుగా పడిగాపులు
- మంత్రి లోకేష్ ఛాంబర్ ఎదుట మహిళ ఆవేదన
- ఇద్దరు పిల్లలకు తీవ్ర చర్మ వ్యాధితో నరకయాతన
సాక్షి, అమరావతి: తన ఇద్దరు పిల్లలకు తీవ్రమైన చర్మ వ్యాధి రావడంతో చికిత్సకు సహాయం చేయాలని ఎనిమిది నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఒక మహిళ తీవ్ర ఆందోళనకు గురై మంత్రి లోకేష్ ఛాంబర్ ఎదుట పడిపోయింది. విజయవాడ రాణిగారితోటకు చెందిన మూలె గోవిందమ్మ (35) ఇద్దరు పిల్లలు మోహన్‌రెడ్డి (10), నాగేంద్రకుమారి (15)లు కొన్నేళ్లుగా తీవ్ర చర్మవ్యాధితో బాధపడుతున్నారు.
ఒళ్లంతా పొట్టు, పొలుసులా వచ్చింది. తాపీ పని చేసుకుని కుటుంబాన్ని పోషించే గోవిందమ్మ భర్త, ఆమె చాలా ఆస్పత్రులకు తిరిగినా జబ్బు ఏమిటో గుర్తించలేకపోయారు. పెద్ద ఆస్పత్రులకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేక 8 నెలలుగా సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మధ్యలో ఒకసారి సీఎం చంద్రబాబును కలిస్తే పాపకు మాత్రం వికలాంగులకిచ్చే పెన్షన్, మందుల కోసం కొద్ది డబ్బు ఇస్తున్నారు.
బాబుకు ఎలాంటి సహాయం అందడంలేదు. ఇద్దరికీ జబ్బు రోజురోజుకూ ముదిరిపోతుండడంతో గోవిందమ్మ సచివాలయంలోని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలోనికి అనుమతించలేదు. శుక్రవారం కూడా పిల్లలతో గోవిందమ్మ సచివాలయానికి రాగా ముఖ్యమంత్రి లేరని, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌ను కలవాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. దీంతో ఉదయం నుంచి ఇద్దరు పిల్లలతోనే లోకేష్ ఛాంబర్ వద్ద పడిగాపులు కాసినా పట్టించుకోలేదు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గోవిందమ్మ ఒక్కసారిగా కిందపడి కొట్టుకోవడం మొదలు పెట్టింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా బయటకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆమె తేరుకుంది. తన పిల్లలకు బాగోలేదని వాపోయింది.