ప్రజల చెంతకే పోలీస్
►శాంతిభధ్రతలను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తా
►మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి
►అక్రమ రవాణాపై ఉక్కుపాదం
►ఎస్పీ సెంథిల్‌కుమార్ 38వ ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(క్రైమ్) : పోలీసులున్నది ప్రజల కోసమేనని, వారి కోసమే తాము పనిచేస్తున్నామన్న నమ్మకాన్ని అందరిలో కలిగిస్తామని ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ అన్నారు. జనం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మెరుగైన శాంతిభద్రతలను అందించడంతో పాటు జిల్లాపై అవగాహన పెంపొందించుకుని పోలీసు సేవలను ప్రజలకు చేరువచేస్తామని చెప్పారు. బుధవారం ఉదయం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయన మొదట సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు.
38వ ఎస్పీగా 11 గంటలకు తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలను గౌరవించడంతో పాటు వారికి న్యాయం చేయడంలో పేద, ధనిక అనే పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఎర్రచందనం, ఇసుక, సిలికా అక్రమ రవాణాతో పాటు జీరో బిజినెస్‌ను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామన్నారు.
నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించి శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తామన్నారు. దోపిడీలు, దొంగతనాల నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకెళతామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి కేసుల నమోదు చేస్తామని వివరించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠి నంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
ఎస్పీకి ఘనస్వాగతం : సెంథిల్ కుమార్ తన సొంతూరు కోయంబత్తూరు నుంచి భార్య, కుమార్తెతో కలిసి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో ఆయనకు మూడో నగర ఇన్‌స్పెక్టర్ కె.వి.రత్నం, ఎస్‌బీ ఎస్సై శ్రీనివాసులురెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్పీ కుటుంబసభ్యులతో కలిసి పోలీసు అతిథిగృహానికి చేరుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు వీఎస్ రాంబాబు, చంద్రశేఖర్, రామారావు, ఇన్‌స్పెక్టర్లు మద్ది శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కె.వి రత్నం, జి. రామారావు, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, జి. మంగారావు, సుధాకర్‌రెడ్డి, బాజీజాన్‌సైదా, బాలసుందరం, వెంకటేశ్వరరావు, నాగేశ్వరమ్మ, ఆర్‌ఐలు శ్రీనివాసరావు, లక్ష్మణకుమార్, చిరంజీవి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. ప్రసాదరావు, కార్యదర్శి అంజిబాబు, పోలీసు కార్యాలయ ఏవో రాజశేఖర్, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలి పారు. అనంతరం ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు.