
యువతిని బలవంతంగా ఎత్తుకెళ్తున్న పోలీసులు
తమను మావోయిస్టులుగా చిత్రీకరించడం ద్వారా పోలీసులు, ప్రభుత్వం మహిళా ఉద్యమాలను అణదొక్కుతున్నారని ఆరోపిస్తూ మహిళా చేతన, చైతన్య మహిళా సంఘం తదితర సంఘాల ధర్నా.. అదే సమయంలో ఈ సంఘాల సభ్యుల ఫొటోలతో కూడిన బ్యానర్లతో గిరిజనులతో పోలీసులు నిర్వహించిన ర్యాలీ.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ రెండు వర్గాలు తారసపడటంతో బుధవారం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. తమ ఫొటోలున్న బ్యానర్లను మహిళా సంఘాల ప్రతినిధులు లాక్కొని.. దహనం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రతిఘటించిన వారిని ఈడ్చుకుంటూ వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా పలువురు మహిళా సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయడంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చర్యలను నిరసిస్తూ పలు సంఘాలు పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు.
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకుంటూ వ్యాన్ ఎక్కించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని దౌర్జన్యంగా లాక్కెళ్లారు. ధర్నా టెంట్లను పడగొట్టారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఒకానొక సమయంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. తమ సభ్యులు మవోయిస్టులకు అనుకూలంగా పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వం పోస్టర్ల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ బుధవారం జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) పలు మహిళా సంఘాలు, వామపక్ష నాయకులతో కలిసి ధర్నా నిర్వహించింది. అదే సమయంలో అరుకు, పాడేరు మండలాల నుండి వచ్చిన కొంత మంది గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వారు పట్టుకున్న బ్యానర్లపై మావోయిస్టులుగా సీఎంఎస్ నేతలు రాజేశ్వరి, అన్నపూర్ణ, లలిత, పద్మ, రాధ ఫొటోలు ఉండటంతో సీఎంఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు.
మావోయిస్టులతో తమకు సంబంధం ఉందని నిరూపించగలరా అని సవాల్‌చేశారు. వారికి వ్యతిరేకంగా ముద్రించిన ప్లెక్సీలను తగలబెట్టారు. సీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ తమకు వ్యతిరేకంగా పోలీసులే కొందమంది గిరిజనులను తీసుకువచ్చారని, ప్లెక్సీలు, బ్యానర్లు ముద్రించారని పేర్కొన్నారు. హింసకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మహిళల్ని చైతన్య పరుస్తున్న సీఎంఎస్ నాయకులను నిర్బంధించడానికే ‘ఆదివాసీ విద్యార్థి సంఘం, విద్యార్థినీ చైతన్య పేరు మీద తమ కార్యకర్తలపై మావోయిస్టులనే ప్రచారం చంద్రబాబు ప్రభుత్వం చేయిస్తోందన్నారు. తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు ఇలాంటి చౌకబారు పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు, విజయవాడ తదితర చోట్ల కూడా తమ గురించి పోస్టర్లు వేయడంతో అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా విశాఖలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఇక్కడ కూడా పోలీసులు రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళా ఉద్యమాలను అణచడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.మావోయిస్టులకు వ్యతిరేకంగా అరుకు నుంచి వచ్చిన భవానీ అనే మహిళ మాట్లాడుతూ పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే నేపంతో తమ గిరిజనులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కోసం పోరాడుతున్నామని చెప్పే మావోలు ఆ ప్రజలనే దండిస్తున్నారన్నారు.ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం.లక్ష్మి తదితరులు మాట్లాడారు. అనంతరం మహిళా సంఘం చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. వారిని ఈడ్చుకుంటూ వ్యాన్ ఎక్కించారు. ధర్నాలో పలు మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్లెక్సీలు తగలబెడుతున్న మహిళా సంఘాల ప్రతినిధులు
మహిళా సంఘాల నిరసన
అల్లిపురం: మహిళా సంఘాల ప్రతినిధుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మహిళా సంఘాల నాయకులు బుధవారం సాయంత్రం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా చేతన కార్యదర్శి కత్తి పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం.లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రతినిధి ఎ.విమల, చైతన్య మహిళా సంఘం ప్రతినిధి ఎస్.అనిత, విరసం ప్రతినిధి కృష్ణబాబు, పౌర హక్కుల సంఘం ప్రతినిధి పి.అప్పారావులు మాట్లాడుతూ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తున్న శిబిరంపై దాడిచేశారని ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్‌లు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment