సాక్షి, కర్నూలు : జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి రూ. 5 కోట్ల ఇసుక అమ్మకాలు జరిగాయి. పరిస్థితులు, అవసరాలు అంచనా వేస్తే ఇప్పటికే రూ. వంద కోట్ల వరకూ వ్యాపారం సాగాలి. వాస్తవానికి అనధికారికంగా అంత వ్యాపారమూ జరిగింది. వివిధ రాజకీయ నాయకుల ప్రమేయంతో అధిక మొత్తం ఇసుకను పక్కదారి పట్టించారు. అన్ని రీచ్‌లలో ఇసుక అమ్మకాలను నేతలు అంతా తామే అయి నడిపిస్తున్నారు.
ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చి పెట్టేందుకు ప్రజాప్రతినిధులు తమవంతు పాత్ర పోషించాలి. అవసరమైన సలహాలు ఇవ్వాలి. లోపాలుంటే సరిదిద్దాలి. అధికారులకు సహకరించాలి. అయితే ఇసుక ఆదాయం విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి వీరిలో కొందరు ప్రజాప్రతినిధులే గండికొడుతున్నారు. తెరవెనుక ఉంటూ తమవంతు పాత్ర పోషిస్తుండగా.. నియోజకవర్గ స్థాయి నేతలు కొందరు వారికి వంత పాడుతున్నారు. దీంతో ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.
అడ్డుకుంటున్న అధికారులపై అధికారపార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అసభ్య పదజాలంతో బెదిరిస్తున్నారు. దీంతో కొందరు అధికారులు మౌనపాత్ర పోషించక తప్పడం లేదు. మరికొందరు అధికారులు మాత్రం నేతల అడుగులకు మడుగులొత్తుతూ అక్రమాలకు ఉడతాభక్తిగా సాయపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్న మహిళలు కేవలం పాత్రధారులు మిగిలిపోతుండగా స్థానిక నాయకులే ప్రధానపాత్ర పోషిస్తున్నారు.
జిల్లాలో 12 రీచ్‌లను డ్వాక్రా మహిళలకు అప్పగించారు. ఏ గ్రామంలోనైతే రీచ్ ఉందో ఆ ప్రాంతంలో చురుగ్గా ఉన్న మహిళలకుగాని, మండలం మొత్తం మీద ఉన్న మండల సమాఖ్యలో ఆసక్తి కలిగిన మహిళలకు గానీ రీచ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గతంలో ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించే వారు. ప్రభుత్వం ధర నిర్ణయిస్తే దానికంటే ఎంత ఎక్కువగా పాడితే వారికి ఆ రీచ్‌ను అప్పగించేవారు. రెండో సంవత్సరం అదే కాంట్రాక్టరు 20 శాతం అదనంగా చెల్లించి రీచ్‌లను నిర్వహించేవారు. ప్రభుత్వం మారాక ఈ విధానంలో మార్పు తీసుకొచ్చింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. వాస్తవానికి మహిళ సంఘాలకు అంత ఆర్థిక ప్రతిపత్తి లేదు. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి అందుకు అనుకూలంగా వీరికి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు అప్పగించారు కానీ క్షేత్రస్థాయిలో వీరు నిబంధనల ప్రకారం పనిచేసే అవకాశమే కనిపించడం లేదు.
పేరు మహిళలది.. పెత్తనం నేతలది
Published Mon, Mar 9 2015 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM
Advertisement